మళ్లీ చంద్రబాబే సీఎం


– పసుపు -కుంకుమ, వృద్ధుల పింఛన్లే మమ్మల్ని గెలిపిస్తాయి
– చంద్రబాబు పడిన కష్టం ప్రజలకు తెలుసు
– విలేకరుల సమావేశంలో టీడీపీ నేత జేసి దివాకర్‌ రెడ్డి
అమరావతి, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : ఏపీలో మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని, ప్రజలంతా ఆయనకే పట్టం కట్టారని, 23న ఫలితాలు ఈ విషయాన్ని రుజువుచేస్తాయని టీడీపీ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. సోమవారం అమరావతిలో చంద్రబాబు నివాసం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. చంద్రబాబు నాయుడు 120 స్కీములు పెట్టారని, దాన ధర్మాలు చేస్తే ఎవరైనా ఆయన కష్టాన్ని చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నదుల అనుసంధానం చేశారని, రైతు బాగుపడాలని చాలా శ్రమించారన్నారు. అప్పు, సప్పూ చేసి.. కాళ్లు పట్టుకున్నారు.. జుత్తు పట్టుకున్నారని అన్నారు. ఇంతలా రైతుల కోసం ఆయన శ్రమిస్తే ఒక్కడైనా ఆయనను అభినందించాడా.. ఎందుకు చెయ్యాలి..  ఏం
అవసరముంది.. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో కూడు, బట్ట పెట్టాయా..  నేను నిజం చెబుతున్నా.. మా తెలుగుదేశాన్ని నిలబెట్టేది.. కేవలం పసుపు – కుంకుమ, ముసలోళ్లకిచ్చే పింఛన్లు. ఈ రెండు లేకపోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి అంటూ జేసీ వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణమన్నారు. ఎన్నికల్లో క్యూలో అమ్మవార్లు, వృద్ధులు విరగబడి వచ్చారన్నారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారని జేసీ పేర్కొన్నారు. అనంతపురం లోక్‌సభలో అందరినీ మార్చమని నేనే చెప్పానని, మార్చకపోతే గెలవం అని చెప్పానన్నారు. అయినా మార్చలేదని, మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే అన్నారు. అనంతపురం టౌన్‌, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నామని, రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పడిన కష్టం ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చుపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాయని, అభ్యర్థులు రూ.25కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేశారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో రూ.50కోట్లు ఖర్చు అయిందని, ఓటు అడిగితే రూ.2వేలు ఇవ్వాలని ప్రజలు అంటున్నారన్నారు. ఇకపై ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించాలన్నదే తన తపనని జేసీ చెప్పుకొచ్చారు.