మళ్లీ చతికిలపడ్డ స్టాక్‌మార్కెట్లు

ముంబయి, మే21(జ‌నం సాక్షి) : దేశీయ మార్కెట్లకు మళ్లీ నష్టాలు తప్పలేదు. కర్ణాటక రాజకీయ పరిస్థితులు, కంపెనీల తైమ్రాసిక ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపర్లు సోమవారం కూడా అమ్మకాల వైపే మొగ్గుచూపారు. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. నిఫ్టీ కూడా 10,600పైన ట్రేడింగ్‌ను ఆరంభించింది. అయితే ఆ లాభాలను ఎంతోసేపు నిలబెట్టుకోలేకపోయాయి. ఫార్మా, ఆటోమొబైల్‌, లోహ రంగాల్లోని షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ట్రేడింగ్‌ ఆరంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు తిరిగి ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 232 పాయింట్ల నష్టంతో 34,616 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 10,517 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ, భారత్‌ పెట్రోలియం, కోల్‌ఇండియా, టీసీఎస్‌, గెయిల్‌ షేర్లు లాభపడగా.. డాక్టర్‌రెడ్డీస్‌, సన్‌ఫార్మా, యూపీఎల్‌ లిమిటెడ్‌, యస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ షేర్లు నష్టపోయాయి.