మళ్లీ తీర్మానం చేస్తే తప్పేంటి?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పుకునే తెలుగుదేశం నాయకులు పార్టీ అత్యున్నత సమావేశం మహానాడులో ఈ అంశంపై మళ్లీ తీర్మానం చేయడానికి కనీస ప్రయత్నాలు చేయడం లేదు. 2004 ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ తెలంగాణకు మద్దతు పలికితే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమై సమైక్య రాష్ట్రం ఉండాలని ప్రజల ముందుకు వెళ్లింది. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌తో అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లింది. సమైక్యవాదమే ఎజెండాగా ఉన్న సీపీఎం కూడా ఈ పార్టీలతో జతకట్టింది. తెలుగువారంతా కలిసే ఉండాలని ఎన్నికలకు వెళ్తే యావత్ రాష్ట్ర ప్రజలు టీడీపీ తిరస్కరించారు. టీడీపీ చరిత్రలోనే అత్యంత దారుణ పరాజయాన్ని చవిచూపించారు. తర్వాత కూడా టీడీపీ తీరులో మార్పురాలేదు. మరోవైపు తెలంగాణకు సై అన్న కాంగ్రెస్ తర్వాతికాలంలో బద్ధ వ్యతిరేకిగా మారింది. టీఆర్‌ఎస్ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తర్వాతికాలంలో తానిచ్చిన హామీని పూర్తిగా విస్మరించింది. ఫలితంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి కోరుకుంటున్న స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుండటంతో టీడీపీ అనివార్యంగా తెలంగాణవాదాన్ని ఎత్తుకుంది. తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగలగాలంటే జై తెలంగాణ అనాల్సిందేనని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు 2008 ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో నిర్వహించిన మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్నే చూపి 2009 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. టీడీపీ ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదు. ఫలితంగా రెండోసారి ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి చావుదెబ్బ తప్పలేదు. 2009 ఎన్నికలకు ముందు మహానాడులో తెలంగాణపై తీర్మానించిన టీడీపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తన తీరు మార్చుకుంది. తెలంగాణ కోసమంటూ 2009 సెప్టెంబర్ నుంచి మహోద్యమం పెల్లుబుకడంతో టీడీపీ ప్రేక్షకపాత్ర వహించిందే తప్ప ఉద్యమంలో పాల్గొనలేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగింది. ఈక్రమంలో ఎక్కడా టీడీపీ కనిపించలేదు. ప్రజల ఆకాంక్షల మేరకు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పది జిల్లాల్లో ఉధృతమైన ఉద్యమం ధాటికి కేంద్రం దిగివచ్చింది. 2009 డిసెంబర్ 9న రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అంతకు రెండు రోజుల ముందు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి తీరాలని పట్టుబట్టాడు. రెండు రోజులు కూడా గడవకముందే మాట మార్చేశాడు. అర్ధరాత్రి ఎవరిని అడిగి తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. అంతకు రెండు రోజుల ముందే తాను తెలంగాణ ఏర్పాటు చేయమని కోరిన విషయాన్ని మరిచి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి కృత్రిమ ఉద్యమానికి తెరతీశాడు. కేవలం చంద్రబాబు అడ్డంగా తిరిగినందునే 2009 డిసెంబర్‌లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు విఘాతం కలిగిందనేది జగద్వితం. దీనిని టీడీపీ ఎంతగా బుకాయించాలని చూసినా ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు. తెలంగాణ విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతీసారి తాము గతంలోనే మహానాడులో తీర్మానించామని, యూపీఏ-1 ప్రభుత్వం తెలంగాణపై ఏర్పాటు చేసిన ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చామని చెప్పుకుంటుంది. కానీ తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో మాత్రం పాల్గొనదు. పార్టీ అన్నాక ప్రతి అంశంపై ఒకే విధానం కలిగి ఉండాలి. తెలంగాణ విషయంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. టీ టీడీపీ నేతలు తెలంగాణకు అనుకూలంగాచ, సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్యరాష్ట్రం కోసమంటూ మైకుల ముందు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమే అయితే, ఆ పార్టీకి చెందిన నేతలంతా తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడాలి. తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమాల్లో పార్టీ అధినేతగా చంద్రబాబు పాల్గొనాలి. కానీ ఏ ఒక్కరోజు చంద్రబాబు తెలంగాణ అనుకూలంగా మాట్లాడలేదు. తెలంగాణకు అనుకూలమని చెప్పే బీజేపీ, సీపీఐ పార్టీల ముఖ్య నేతలు ఈ అంశంపై నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు తెలంగాణపై ఒకే వైఖరి అనుసరిస్తున్నారు. టీడీపీ నేతలే భిన్నమైన విధానాలు అవలంబిస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. టీడీపీ తెలంగాణకు కట్టుబడే ఉంటే మహానాడులో మళ్లీ తీర్మానం చేయాలి. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆ పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఎవరూ విశ్వసించరు.