మళ్లీ ముంచిన మన నాయకులు
అంతా అయిపోయింది. అనుకున్నదే జరిగింది. నిన్నటి వరకు వరకు ఉన్న అనుమానమే నిజమైంది. యావత్ తెలంగాణ కోరుకున్నదొకటి, తెలంగాణ గళం వినిపించాల్సినోళ్లు చేసిందొకటి. మళ్లీ అదే మాట. అదే పాట. అధిష్టానంపై తమకు ఉన్నదని, తెలంగాణ ఇస్తదని వాళ్లు చెప్పుకొచ్చారు. మన తెలంగాణ ప్రజల ఆశను ఆవిరి చేశారు. నమ్మిన నాలుగున్నర కోట్ల మందిని ఎప్పటిలాగే నిండా ముంచేశారు. ముంచిందెవరన్న సంశయం అవసరం లేదు. ఇప్పటి వరకు ముంచుతూ వస్తున్న వాళ్లే.. ఇక ముందు ముంచే అవకాశముందని తేల్చేశారు. ఇంకెవరు ? మనం మన గళాన్ని వినిపిస్తారని ఎన్నుకుని, ఢిల్లీకి పంపిన మన తెలంగాణ ఎంపీలు. సోనియమ్మ ముందు కూర్చోగానే వాళ్లకు ఎప్పటిలాగే నోట మాట రానట్లుంది. బడిలో పాఠం వినే విద్యార్థిలా కిక్కురుమనకుండా ఆమె చెప్పింది. బయటికి వచ్చారు. కనీసం నోటి మాటగానైనా ‘తెలంగాణ’ అన్న పదాన్ని ఉచ్ఛరించలేదు. తెలంగాణ ప్రజాప్రతినిధులు పదవీదాసులు అంటూ చేసే విమర్శకు బలం చేకూరేలా వ్యవహరించారు. సోనియమ్మ ఆగ్రహిస్తుందని భయపడ్డారో, ప్రజలు పట్టించుకోరన్న నమ్మకమో, ఏ మాత్రం తెలంగాణపై మాట్లాడకుండా, చెప్పింది విని, పెట్టింది తిని, ఇచ్చింది తాగి తాపీగా నవ్వుతూ, బొర్రలు నిమురుకుంటూ బయటికి వచ్చారు. రాగానే ఎప్పటిలాగే మీడియాతో మాట్లాడుతూ ‘మా అధిష్టానంపై మాకు నమ్మముంది, తెలంగాణ ఇస్తుందన్న భరోసా ఉంది, అందుకే, రాష్ట్రపతి ఎన్నిక సజావుగా సాగాలని తెలంగాణపై మాట్లాడలేదు’ అని పాత పాటకే కొత్త రాగాలు కట్టారు. రాష్ట్రపతి ఎన్నికను ఆయుధంగా వాడుకుని, తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని, లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పాలని, వీళ్ల మీటింగుకు నాలుగు రోజుల ముందు తెలంగాణ జేఏసీ లేఖ రాసి మరీ హితబోధ చేసినా చెవికెక్కించుకోలేదు. జేఏసీ తెలంగాణ కోసం పోరాడుతున్న ఓ రాజకీయేతర సంస్థ. దానికి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. అది చెప్పేది కచ్చితంగా జనాభీష్టమేనని తెలిసినా మౌనంగా ఉన్నారు. తమ రాజకీయ ప్రయోజనాలనే చూసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణగదొక్కారు. ఎప్పటిలాగే తాము అధిష్టాన దాసులమని నిరూపించుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకి అని ముద్రపడ్డ ప్రణబ్ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని బలపర్చేందుకు సిద్ధపడ్డారు. అంతేనా, మిగతా వారు కూడా, అంటే, టీఆర్‌ఎస్ కూడా ప్రణబ్‌కు మద్దతివ్వాలని హితవు పలికారు. ఇదీ ‘తెలంగాణ తెచ్చేది మేమే.. ఇచ్చేది మేమే’ అని పదే పదే వల్లించే మన తెలంగాణ ఎంపీల తీరు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ చీఫ్, మాజీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఓ అడుగు ముందుకేసి ‘ఎవరో చెబితే తెలంగాణ ఇవ్వరు.. ఎప్పుడివ్వాలో మా అధిష్టానానికి తెలుసు.. త్వరలోనే తెలంగాణ వస్తుంది.. ప్రజలు మళ్లీ సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం లేదు’ అంటూ ఓ ప్రకటన చేసి రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ ఇచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు.
ఇంకా వీళ్లను నమ్మాలా ? నమ్మితే ఉద్యమాన్ని మొత్తం ఢిల్లీ పెద్దలకు పెట్టే అవకాశం లేదా ? అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి కల్పించారు. ‘కీలక సమయంలో వీళ్లు స్పందించరు.. ఇక వీళ్లు మారరు’ అని నిర్ణయించుకునేలా చేశారు మన ఎంపీలు. ఇక టీడీపీ ఎలాగో ఎన్నికలో పాల్గొనేది లేదని స్పష్టం చేసింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఉంది. ఈ ఎన్నికలోనూ టీడీపీ తనది రెండు కళ్ల సిద్ధాంతమేనని పరోక్షంగా చెప్పింది. అదెలాగంటే, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, అందుకు కాంగ్రెస్‌వాది అయిన ప్రణబ్‌కు ఓటేయమని.. మతతత్వ పార్టీ అయిన బీజేపీ బలపర్చే ఎన్డీఏ అభ్యర్థిగా సంగ్మా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఓటేయమని ప్రకటించి, తను నమ్మిన ‘సిద్ధాంతా’నికే కట్టుబడి ఉంది. తెలంగాణలో మిగిలిన ప్రధాన పార్టీ టీఆర్‌ఎస్, ఆ పార్టీ ఇంకా రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయాన్ని ప్రకటించలేదు. తెలంగాణ సాధన కోసమే తమ పార్టీ ఆవిర్భావం జరిగిందని చెప్పే ఈ పార్టీ ప్రజాప్రతినిధులైనా నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షను చెబుతారో, లేక ‘ప్రయోజనాల’ కోసం పాకులాడుతారో త్వరలోనే తేలనుంది.