మహబూబ్ సాగర్, కిసాన్ సాగర్ చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
చెరువు కాలువలను ఆక్రమిస్తే
కఠిన చర్యలు…
.. జిల్లా కలెక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
చెరువు కట్టు కాలువలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సోమవారం ఆయన జిల్లా ఎస్పీ, అధనపు కలెక్టర్ తో కలిసి జిల్లా కేంద్రంలోని మహబూబ్ సాగర్, కందిలోని కిసాన్ సాగర్ చెరువులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో అలుగు పారుతున్న మహబూబ్ సాగర్ చెరువును పరిశీలించిన కలెక్టర్, చెరువు కింద గల కాలువ గడ్డి, గుర్రపు డెక్క తదితరాలతో పూడుకొని ఉండటాన్ని గమనించి, వెంటనే పూడిక తీసి నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆయా అధికారులు వెంటనే కాల్వపూడిక తొలగించి వర్షం నీళ్లు సాఫీగా వెళ్ళేలా పనులు పూర్తి చేశారు.చెరువు అలుగు పారుతున్నందున ప్రజలు తిలకించడానికి వచ్చే అవకాశం ఉందని, చెరువు కట్ట పైకి ఎవరిని అనుమతించవద్దని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు.
అనంతరం కంది జాతీయ రహదారి (ఐఐటి పక్కన) పక్కన గల హోటల్ యాజమాన్యం చెరువు కట్టు కాలువను ఆక్రమించి పార్కింగ్ చేసుకోవడంపై ఆగ్రహించిన కలెక్టర్ వెంటనే పార్కింగ్ తొలగించి కాల్వ పూడిక తీయాలని నీటిపారుదల ,పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత అధికారులు రంగంలోకి దిగి పార్కింగ్ స్థలాన్ని తొలగించి, కాలువను ఓపెన్ చేశారు. అదేవిధంగా ఐఐటీలో కూడా మూసి వేసిన కట్టు కాలువను తిరిగి ఓపెన్ చేయాలని ఐఐటి ఎస్. ఈ కి కలెక్టర్ సూచించారు.
చెరువు కట్టు కాలువలను ఆక్రమించితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ రమణ కుమార్, అధినపు కలెక్టర్ వీరారెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్.ఈ. మురళీధర్,ఈఈ మధుసూదన్ రెడ్డి, డి ఈ బాల గణేష్, డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, సిఐ రమేష్, సంగారెడ్డి ,కంది తహసిల్దార్లు స్వామి ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.