మహమూద్‌ అలీ నేతృత్వంలో కొత్త జిల్లాల మంత్రివర్గ ఉపసంఘం

3

కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. డిప్యూటి సిఎం మహ్మూద్‌ అలీ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. జిల్లాల సంఖ్య, కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు, తాత్కాలిక ఏర్పాట్లు, వసతి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల కేటాయింపు, జోనల్‌, శాఖల పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీనిపై సిఎం కెసిఆర్‌ మంగళవారం  సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం కొత్తగా 14 జిల్లాల ఏర్పాటుకు సిఎం కెసిఆర్‌ సానుకూలంగా ఉన్నారు. అయితే ఇందులో డిమాండ్‌ ఉన్న జనగాం, బెల్లంపల్లి, గద్వాలలకు స్థానం కనిపించడం లేదు.  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని కమిటీముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించిన నివేదికలో 14 కొత్త జిల్లాలు 74 కొత్త మండలాలను ప్రతిపాదించింది. ముసాయిదా జాబితాలో నిర్మల్‌కు చోటు దక్కగా, సిరిసిల్ల అవకాశం కోల్పోయింది. కొత్త జిల్లాలపై ఈ నెల 22న ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు

అనుగుణంగా ఈ తేదీని ఖరారు చేశారు. కొత్త జిల్లాలు, మండలాలపై తాము పరిగణనలోకి తీసుకున్న అంశాలను కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది.కొత్త జిల్లాలను ఖరారు చేస్తున్న సమయంలో అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని సూచించారు. కరీంనగర్‌లో జగిత్యాల జిల్లాను ప్రతిపాదించినందున కొత్తగా మళ్లీ సిరిసిల్లను చేయడానికి ఏ మాత్రం అవకాశం లేదని అభిప్రాయపడింది. దీనికి అనుబంధంగా నియోజకవర్గాలు, మండలాల కూర్పు సమస్యగా మారుతుందని, మిగిలిన రెండు జిల్లాల అస్తిత్వానికి విఘాతంగా మారుతుందని సీఎస్‌ కమిటీ సూచించినట్లు తెలిసింది. కొత్త జిల్లా చేయడానికి నిర్మల్‌కు అన్ని విధాలా అర్హతలు ఉన్నాయని కమిటీ పేర్కొంది. కొత్త జిల్లాలకు ప్రాతిపదికగా తీసుకున్న అంశాలను సీఎం అభినందించారు.  తమ ప్రభుత్వ నిష్పాక్షిక విధానానికి ఇది ఉదాహరణ అని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. మరోవైపు నిర్మల్‌ను జిల్లా చేయడానికి ఆయన సుముఖత తెలిపారు. ఆయన గూగుల్‌లో నిర్మల్‌ ప్రాంతాన్ని చూపుతూ దానిని ఎందుకు జిల్లా చేయాల్సి ఉందో అధికారులకు వివరించారు. నిర్మల్‌ జిల్లా ప్రతిపాదన ముందుగా లేదని, తాను గూగుల్‌లో పరిశీలించి దాని అవసరాన్ని గుర్తించానని ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఆదిలాబాద్‌ జిల్లా విభజన జరిగిన తర్వాత కూడా నిర్మల్‌ ప్రాంతానికి మేలు జరగకుండా గతంలో మాదిరిగానే ఉంటే అది అన్యాయమే అవుతుందని తాను భావించానని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం.