మహాకూటమిని ఛీ కొడుతున్నారు
కూటమిలో సీట్ల పంచాయితే తేలడం లేదు
ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
ప్రచారంలో మంత్రి మహేందర్ రెడ్డి
వికారాబాద్,నవంబర్17(జనంసాక్షి): ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. కూటమి పేరు చెబితేనే ప్రజలే మండిపడుతున్నారని అన్నారు. తమ నేత కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించి 70 రోజులైనా వారికి అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయడం లేదన్నారు. అయినా కూటమి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి అన్నారు. శనివారం వివిధ ప్రాతాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ప్రజలే కారు గుర్తుకు ఓటు వేస్తామని చెప్పుతున్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తనను మరోసారి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మహకూటమి నేతలకు బీ పారాలకే దిక్కులేదని.. వారు ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారన్నారు. మహకూటమి ద్రోహుల కూటమని.. తెలంగాణ నుంచి దాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ తోనే అభివృద్ది సాధ్యమన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. గడప గడపకూ తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ, రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ తమను అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీ అపవిత్ర కలయికతో ఏర్పడ్డ మహకూటమి తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. వారి కుట్రలను తిప్పి కొట్టి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. నాలుగున్నరేండ్లలో ఎన్నో ప్రజారంజక పథకాలను అమలు చేసి పేదల సంక్షేమానికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తనపై ఎనలేని విశ్వాసంతో అండగా నిల్చిన ప్రజలు మరోసారి అండగా నిలిచి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఇంతకాలం కాంగ్రెస్, టీడీపీలు ముస్లింలను ఓటు వేసే యంత్రాలుగానే చూసాయని మంత్రి అన్నారు. వారిని సమానంగా ఆదరించి గౌరవించిన ఘనత కేవలం కేసిదర్‌దన్నారు. అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ జీవిస్తున్నారని తెలిపారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనట కెసిఆర్‌దని వెల్లడించారు. పేద ముస్లిం యువతుల పెళ్లి కోసం షాదీముబారక్ అమలు చేస్తున్నట్లు వివరించారు.