మహానాడు రద్దు చేసుకున్న బాబు

సంస్థాగత నిర్మాణంపై దృష్టి
విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడిహైదరాబాద్‌్‌, జూలై 9 (జనంసాక్షి) :
మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశంపార్టీ మంగళ వారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో జయాపజయాలను చవిచూ సినప్పటికీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న పార్టీ ఫండుగా మహానాడును ఈ ఏడాది రద్దు చేసింది. సాధారణంగా ప్రతీ ఏడాది మే 29న టీడీపీ మహా నాడును ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది ఉప ఎన్నికలు రావడంతో ఎన్నికల తర్వాత నిర్వహించాలని అప్పట్లో వాయిదా వేశారు. ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం.. నేతలు పార్టీ నుంచి వలసల బాట పట్టడం, పార్టీని కలవరపరిచింది. దీంతో పార్టీని పటిష్టపరిచే క్రమంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరుగుతున్న టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాదికి
మహానాడును రద్దు చేసి పార్టీని తిరిగి పట్టాలెక్కించే అంశంపై దృష్టి సారించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామ, వార్డులు, కమిటీల ఎన్నికలు జరపాలని, ఆగస్టు 5 నుంచి 20వరకు మండల పార్టీతో పాటు అనుబంధ కమిటీల ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు 20 నుంచి 30 వరకు జిల్లా పార్టీ అనుబంధ కమిటీల ఎన్నికలను నిర్వహించను న్నారు. రెండు రోజుల పాటు జరిగే పార్టీ విస్తృత సమావేశం ప్రారంభం రోజునే కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే నాని జగన్‌ పార్టీవైపు చూడడంతో ఆయనను సస్పెండ్‌ చేశారు. అనంతర పరిణామాలపై మంగళవారంనాడు జరిగిన సమావేశంలో పార్టీ అధినేత ఆ జిల్లా నేతలతో చర్చించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా.. నిరుత్సాహ పడాల్సిన పనిలేదని, ఒక నాయకుడు వెళితే.. 10 మంది నాయకులను తయారు చేసుకుందామని కార్యకర్తలు నిరుత్సాహపడ కుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్యం చేయాలని వచ్చే ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించుకుందామని చంద్రబాబు చెప్పారు.