మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
61వ సంవత్సరంలోకి మన సీఎం
శుభాకంక్షలు తెలిపిన గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం ఫడ్నవిస్
ముంబై, ఫిబ్రవరి17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు 61వ పడిలోకి అడుగుపెట్టారు. సీఎం కేసీఆర్ తన జన్మదిన వేడుకలను మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ కేక్ కట్ చేశారు. కేసీఆర్‌కు గవర్నర్ విద్యాసాగర్‌రావు విందు ఇచ్చారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలస్వామి, జలరంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు, మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు ఉన్నారు. ఇవాళ ఉదయం శివరాత్రి సందర్భంగా ముంబయిలోని సిద్ధివినాయక గుడిలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కేక్స్ కట్ చేశారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు బంగారు తెలంగాణ పునర్‌నిర్మాణంలో పూర్తిగా సహకరిస్తామని కార్యకర్తలు చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే. ఢిల్లీ పర్యటన ముగించుకున్న కేసీఆర్ సోమవారం రాత్రి ముంబయి చేరుకున్నారు. ముంబయి పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కేసీఆర్ సమావేశమై ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఫడ్నవీస్‌తో భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు పయనం కానున్నారు.