మహిళలకు మరింత భరోసా

3

– హాకా భవన్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు

హైదరాబాద్‌,మే7(జనంసాక్షి): విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, పిల్లలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు హైదరాబాద్‌ నగర పోలీసులు ఏర్పాటుచేసిన ‘భరోసా’ కేంద్రం తెలంగాణ మహిళలకు భరోసాను కలిగిస్తుందని రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హకాభవన్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.    అత్యాచార బాధితులు, ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం గర్వించదగిన విషయమని నాయిని నర్సింహారెడ్డి అన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, అదనపు సీపీ స్వాతిలక్రాలతో కలిసి ఆయన ప్రాంభించారు. వివక్షకు గురవుతున్న మహిళలను చేరదీసి వారికి ‘భరోసా’ కల్పించే ఉద్దేశంతోనే ఈ కేంద్రం ఏర్పాటుచేసినట్లు నాయిని చెప్పారు. ఇలాంటి కేంద్రాలను జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రస్తుతం షీ టీమ్‌లు చక్కగా పనిచేస్తున్నాయని, వాటికి మించిన రీతిలో ‘భరోసా’ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉందని, నగరంలో షీటీమ్‌ల పనితీరు మెరుగుపడినందు వల్ల పోలీసుల భర్తీలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సీఎం అంగీకరాం తెలిపారని డిజిపి అనురాగ్‌ శర్మ అన్నారు. అభాగ్యులు, బాధిత మహిళలు తమకు అన్యాయం జరిగితే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని, చిన్నారులకు ఇబ్బందులు తలెత్తితే 1098 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని స్వాతి లక్రా విజ్ఞప్తి చేశారు. ఈ భరోసా కేంద్రానికి ¬ంమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే మహిళలు, అమ్మాయిలను వేధించే ఈవ్‌టీజర్ల ఆటకట్టించేందుకు షీ టీమ్స్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే బాధితులైన, వేధింపులకు గురవుతున్న స్త్రీలు, పిల్లల్లో మనోస్థైర్యం నింపడంతో పాటు వారి జీవితంపై నమ్మకాన్ని కలిగించేందు కోసం నగర పోలీసులు ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మతసామరస్యాన్ని కాపాడుతూ శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులకు దేశస్థాయిలో మంచి పేరు వచ్చిందన్నారు.