మహిళలపట్ల వివక్ష తగదు

ఏలూరు,జూలై9(జ‌నం సాక్షి): సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళలే ఉద్యమించాలనిప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ పి.భారతి పిలుపునిచ్చారు. సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా మహిళలపై వివక్ష, దాడులు మాత్రం తగ్గడం లేదన్నారు. పనిచేసే మహిళలకు వేతనాలివ్వడంలో వివక్ష చూపుతూ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వాలు కూడా మహిళలపై చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. ఇటీవల జరగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అలాగే మహిళలను నీచంగా చూసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు తక్కువ వేతనాలిస్తూ వెట్టిచాకిరీ చేయించడం ప్రభుత్వానికి తగదన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు చైతన్యవంతులై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.