మహిళల భద్రతకు కలిసి పనిచేద్దాం రండి
జాతికి ప్రధాని పిలుపు
అవినీతి నిర్మూలనకు కృషి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 (జనంసాక్షి) :
మహిళల భద్రతకు కలిసి పనిచేద్దాం రండి అని ప్రధాని మన్మోహన్‌సింగ్ జాతికి పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన సివిల్ సర్వీస్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నా యని తెలిపారు. ఇది ఎంతో ఆవేదన కలిగించే అంశమన్నారు. అత్యాచారాలను నిరోధించడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలోని మహిళలకు రక్షణ ఇప్పటికీ సమస్యగానే ఉందన్నారు. ప్రజల దృక్పథంలోనే మార్పు రావాలని ఆకాంక్షించారు. మహిళకు రక్షణ కల్పించడం సామాజిక బాధ్యత అన్నారు. ఇటీవల కాలంలో మనుషుల్లో పెడ ధోరణులు పెరిగిపోతున్నాయని తెలిపారు. బాలికలు, మహిళలపై వరుస అత్యాచారాలు కొనసాగించడం దారుణమన్నారు. దీనిని సామాజిక రుగ్మతగా ఆయన అభివర్ణించారు. అందరూ ఏకమై ఈ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నగదు బదిలీ పథకానికి ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల దళారీ వ్యవస్థ మటుమాయం కావడం ఖాయమన్నారు. ఇంతకాలం వేళ్లూనుకుపోయిన అవినీతి వల్ల ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరేవి కావన్నారు. కొందరు దళారుల అవతారమెత్తి లబ్ధిదారులకు అందాల్సినవి కాజేసిన సందర్భాలూ లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటివి ఇంకా కొనసాగకూడదని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందన్నారు. అందుకోసమే యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఐఏఎస్ అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని అన్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన వారంతా జాతికి సేవ చేసేందుకు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ సేవలందించిన ఐఏఎస్ అధికారులకు ప్రధానమంత్రి అవార్డులు ప్రదానం చేశారు.