మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు
(మంగళవారం తరువాయి భాగం)
అన్ని విధాల భద్రత కలిగి ఉన్న మహిళలకి ఈ చట్టాల విలువ తెలియకపోవచ్చు కానీ వారి జీవితాలకి భిన్నంగా, భద్రత లేకుండా, ఎలాంటి రక్షణ కవచాలూ లేని స్త్రీలు ఎందరో. వారికిఈ చట్టాలు కొంత ఊరట కల్పిస్తాయి. ‘పేదరికం సాధించే నిశ్శబ్ద హింస’ కి బలైపోయిన మహిళలకి అవి అవసరమే.
అయితే, ఈనాడు అమలవుతున్న చట్టాల వల్ల కూతుళ్లకి కొడుకులతో సమానంగా ఆస్తి హక్కు ఉంది. క్రిస్టియన్ మహిళలు విడాకులు కోరాలంటే భర్త వ్యభిచారే కానవసరం లేదు. ‘గార్డియన్‌షిప్’ ఆక్టు కింద తల్లులు కూడా చట్టపరంగా పిల్లలకి బాద్యత వహించవచ్చు. అలానే, ఉన్నత పదవుల్లో ఎందరో స్త్రీలు కనిపిస్తున్నారు. దేశ అధ్యక్షులుగా, స్పీకర్‌గా, రాజకీయ పార్టీల నేతలుగా ఎందరో పైకి వచ్చారు. కానీ దీన్ని ప్రగతి అందామా? దీనివల్ల సమాజం మారిపోతుందా?
రాజ్యాంగంలో స్త్రీ పురుషుల సమానత్వాన్ని లేవనెత్తి ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఇంకా నీళ్ల గ్లాసు సగమే నిండింది. సగం నిండిందని సంబరపడదామా? సగం ఖాళీగా మిగిలిపోయిందని భాద పడుదామా? స్త్రీల హక్కుల సాధన కోసం, సాధికారత కోసం ఇంకా ఎంతో పోరాడవలసే ఉంది.
3. విప్లవ చైతన్యంతో సమీకృతులైన స్త్రీలు
తెలంగాణ సాయుధ పోరాటం: స్వాతంత్య్రానికి ముందే ఆరంభమై, స్వాతంత్య్రానంతరం కొనసాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళల పాత్ర, తర్వాత జరిగిన ఎన్నో పోరాటాలకు స్పూర్తిదాయకంగా నిలిచింది. 1946-51 వరకు కానసాగిన ఈ పోరాటం యుద్దానంతరం రైతాంగ పోరాటాలకు ఒక ప్రతీక. అంతకు ముందు తెలంగాణ ప్రాంతపు సామాజిక ఆర్థిక పరిస్థితులను సంస్కరించడం కోసం 1930లో ఆంధ్ర మహా సభ ఏర్పడింది. అది 1940 నాటికి కమ్యూనిస్టు ప్రాబల్యంతో నడిచింది. ఇదే కాలంలో అభ్యుదయ రచయితలు విరివిగా రచనలు చేశారు.
అంతవరకు కాంగ్రెస్ చేతులు కలిపిన కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటంతో తన ఉనికిని చాటుకుంది. ఆ కాలంలో తెలంగాణ ప్రాంతం భూస్వామ్య వర్గాల దోపిడీ కింద నలిగిపోతోంది. దానికి తోడు నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల పాశవికత, బాంచన్ బతుకుల కన్నీటితో, నెత్తుటితో ఆ నేల తడిసిపోయింది. పుడితే శిస్తు, గడితే శిస్తు, వెట్టి చాకిరి. చేతివృత్తుల దోపిడి, ఆడపిల్లల్ని చెర పట్టి దాసీలుగా మార్చి, శారీరకంగా వాడుకోడం, అత్తవారింటికి వెళ్తున్న కూతుళ్లతో పాటు ఈ దాసీలను నజరానాగా పంపించడం. ఊళ్లలోకి అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురుని దొర తన పడకటింట్లోకి లాక్కురావడం, బాలింతల పాటు పిండి నేలపాలు చేయడం-ఇలా రకరకాలుగా స్త్రీలను8 వేధించిన రోజులవి. ఆత్యగౌరవం నేలరాసిపోయిన, నిరుపేద, దళితవర్గాలు తలెత్తుకోలేని పరిస్థితులు అవి. ఆ కుల, వర్గ దోపిడీలకు వ్యతిరేకంగా రైతాంగం ఉవ్వేత్తున లేచింది. దొర కాళ్లకింద అణిగి ఉన్న దుమ్ము లేచి దొర కంట్లో నలుసై సలపరించింది. ప్రజల వీపుల మీద వీరంగం వేసిన చర్నాకోలు తిరగబడి దొల వీపేనే సాపుచేశాయి.
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి సాగిన వీరోచిత తెలంగాణ రైతాంగం పోరాటం సాయుధ పోరాటంగా రూపొందే క్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూపోరాటాల్లో, రైతు కూలీ పోరాటాల్లో ముందున్నారు. భూస్వాముల ధాన్యాన్ని స్వాదీనం చేసుకోవడంలో పాలు పంచుకున్నారు. కోయ, చెంచు, లంబాడా, తెగలను తమ పల్లెల నుంచి తరిమి వేయాలనే బ్రిగ్స్ ప్లాన్‌కి వ్యతిరేకంగా పోరాడారు. తమ అన్నలతో, భర్తలతో కలిసి నిజాం తొత్తుల్ని, రజాకార్లని ఎదిరించి, తర్వాత నెహ్రూ-పటేల్ సైన్యాలని, పోలీసులని కూడా ఎదిరించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి మహిళలు దళాల్లో చేరారు. రాజకీయ, సైనిక దళాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. కొరియర్లుగా, కార్యకర్తలుగా ఆర్గనైజర్లుగా, కార్యకర్తలుగా, ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. ప్రజాందోళనల్లో, రైతాంగ ఉద్యమాల్లో పాల్గొనే క్రమంలో భూస్వాముల నుంచి, పోలీసుల నుంచి ఎన్నో చిత్రహింసలకు గురయ్యారు. మానభంగాలు, గర్బిణీ స్త్రీల కడుపులు చీల్చడాలు, పచ్చిబాలింతపై అత్యాచారాలు, చనుబాలని బలవంతంగా పిండి నేలపాలు చేయడం, గడ్డి వాముల్లో సజీవ దహనాలు, ఉద్యమకారుల పైజామాల్లోకి తొండల్ని వదిలి వేధించడం వంటి హింసలు అనుభవిస్తూ కూడా స్త్రీ ఆత్మస్థైర్యం సడలలేదు. భూమి, భుక్తి విముక్తి సాధించుకోవాలనే తపన చల్లారలేదు. అందుకే మర ఫిరంగులు మోగినా, బాంబుల వర్షం కురిసినా, ఎత్తిన జెండా దించకోయ్’ అంటూ ఉద్యమించారు. మరింత రాటుదేలి, తీవ్రంగా ప్రతిఘటించారు. సామాజికంగా, ఆర్థికంగా అణగారిపోయిన స్త్రీలలో ఈ విప్లవోత్తేజం మరింతగా ఉరకలెత్తించింది. పాలకుర్తి గ్రామంలో ఐలమ్మ ముకుందపుంలో కుమారి, ఓడపల్లి, కొండ్రపోలు, మొద్దులకుంటల్లో లంబాడీ విధవలు, ఇంకా అనేకులు భూపోరాటాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో తునికాకు పోరాటాలు చేశారు. ఆకు తెంపినందుకు కూలీరేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుకూలీ సమ్మెల్లో పోరాటాల్లో ఇరవై కంటే ఎక్కువ గ్రామాల్లో మహిళలే నాయకులయ్యారు. దళాల్లో కూడా స్త్రీలు చురుకైన పాత్ర నిర్వహించారు. పోలీసుల ఆనుపానులు కనుక్కుంటూ గెరిల్లాలకు ఆహారాన్ని అందిస్తూ వీరులను ఎంతో ప్రేమగా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. రాళ్లతో, రోకళ్లతో, కారంతో, గునపాలతో, నాగలి కర్రలతో, పశువుల గంటలతో వాళ్లు పోలీసులను వీరోచితంగా ఎదుర్కోన్నారు. అందుకే ఆనాటి మహత్తర ఘటనలనీ, మహిళల సాహస గాథలను, వారి భాధలను ఎవరు మర్చిపోగలరు’ అన్నాడు సుందరయ్య ఇలాంటి పోరాటాలని మరో స్థాయికి తీసుకువెళ్లింది శ్రీకాకుళం.
శ్రీకాకుళ సాయుధ పోరాటాంలో మహిళల వీరోచిత పాత్ర:
స్వాతంత్య్రానంతరం ఉత్తర బెంగాల్‌లో జరిగిన నక్సల్‌బరీ సాయుధ రైతాంగ పోరాట కొనసాగింపుగా నిరుపేద గిరిజనులు శ్రీకాకుళంలో ఆయుధాలు చేతబట్టి వ్యాపారులను, భూస్వాములను, అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంపదపై తమ హక్కులను బ్రిటిష్ ఏజెంట్లు హరించి వేయగా, భూమి పోయి, పంటపోయి, అటవీ సంపదపోయి వారు బానిసలైపోగా, కడుపు కాలి పిడికిలి బిగించారు. 1958నుంచి అక్కడ గిరిజన సంఘాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన చింతచెట్ల మీద పన్నుని వ్యతిరేకిస్తూ, గిరిజన కార్పోరేషన్ అక్రమాలను ఎదుర్కొంటూ, ఫారెస్టు ఉద్యోగులు చేయించే వెట్టిని తిప్పికొడుతూ, పోలీసుల లంచగొండితనాన్ని ఎండగడుతూ, వాళ్లు ఎన్నో పోరాటాలు చేశారు. పాలేళ్లు జీతాలు పెంచుకున్నారు. 1967 నాటికి కూలీపెంపు, కౌలుదారుకి పంటలో మూడింట రెండు వంతుల వాటా, భూస్వాముల భూముల ఆక్రమణ, బంజరు భూమి స్వాదీనం, బాకీల మాఫీ వంటి విజయాలతో వెంపటాపు సత్యం, రాములు మాస్టార్లు, నాయకత్వంలో సంఘం ప్రభావం పెరిగింది. గిరిజనుల రాజకీయ చైతన్యాన్ని, సమరశీలతని చూసి భయపడిన ప్రభుత్వం 1968 ఆరంభానికే దాడి ఆరంభించింది. అరెస్టులు, కేసులు, దాడులు హెచ్చుమీరాయి. దీనికి ప్రతిఘటనగా శ్రీకాకుళ గెరిల్లా పోరాటం మొదటి దశ ఆరంభమైంది. అందులో ఎందరో స్త్రీలు పాల్గొన్నారు. పంచాది నిర్మల కీలకమైన పాత్ర వహించింది. అప్పుడు భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, పోలీసు ఇన్‌ఫార్మర్ల మీద దాడులు జరిగాయి. ఆస్తుల స్వాదీనం, రుణపత్రాల ధ్వంసం, ధాన్యం రాసుల స్వాధీనం, క్రూరమైన భూస్వాముల హతం జరిగాయి. ప్రజా కమిటీలు గ్రామాలన పాలించాయి. ప్రజాకోర్టులు తీర్పు చెప్పాయి. మిలిటెంట్ రైతాంగ ఉద్యమం రాజకీయ చైతన్యం గల ప్రభుత్వవ్యతిరేక పోరాటంగా మారడాన్ని ప్రభుత్వం సహించలేదు. ఆ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి, నాయకులను, కార్యకర్తలను ‘ఎన్‌కౌంటర్’ పేరుతోవ కాల్చి చంపింది. 1970జులై వరకు సాగిన ఈ దమనకాండలో 157 మంది అమరవీరులుకాగా, వారిలో 82 మంది గిరిజనులుఅందులో 17 మంది మహిళలలున్నారు.
ఉద్యమ కాలంలో వందలాది మంది గిరిజన స్త్రీలు తమ కుటుంబాలను వదిలి సంఘం కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సంవత్సరాల తరబడి జైలు శిక్షలు అనుభవించారు. పోడు వ్యవసాయం చేస్తూ పొడలు నరకడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం, నూర్చడం, తూర్పారబట్టడం, గట్లు కట్టడం, ఇంటి పని, నీళ్లమోత, వంట చెరకు సేకరణ, అటవీ సంపద పోగు చేయడం, ధాన్యం రంచడం, వంట చేయడం, తాళ్లు పేనడం, పశువుల పోషణ వంటి పనులన్నీ చేసే గిరిజన స్త్రీలు ఎందులోనూ వెనకబడలేదు. పోడు హక్కు కోసం, అటవీ సంపద క&ఓసం, వెట్టీ రద్దుకోసం, వడ్డీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం కోసం, దౌర్జన్యాలను వ్యతిరేకించడం కోసం స్త్రీలు పోరాడుతూ ముందు పీటిన నిలిచారు. మైదాన ప్రాంతాల్లో కూడా రైతు కూలీ పోరాటాలు చేపట్టారు. వెట్టిపని చేస్తూ లైంగిక అత్యాచారాలకు గురయ్యే స్త్రీలకి అండగా మహిళా సంఘం నిలిచింది. సారా వ్యతిరేక క్యాంపెయిన్ జరిగింది, స్త్రీల ఉమ్మడి శక్తి అనుభవమయింది.
డాక్టర్ నళిని
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…