మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు
(బుధవారం తరువాయి భాగం)
సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు ప్రదర్శనలు, బహి రంగ సభలు, సమ్మెలు వారి దినచర్యగా మారాయి. వందలాది మైళ్లు నడిచి మీటింగ్‌లో పాల్గొన్న ఘటనలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం పోరాటం రెండవ దశలో 1967 అక్టోబర్ 31 న మొండెంఖల్‌లో జరుగుతున్న గిరిజన మహాజభకు గుమ్ము గ్రామం నించి వస్తున్న నాలుగు వందల మంది గిరిజన స్త్రీల మీద భూస్వామి గూండాలు లేవిడి వద్ద దాడి చేశారు. ఈ విషయం తెలిసి మొండెంఖల్ నించి తరలివచ్చిన ప్రజలు ఈ దాడిని తిప్పికొట్టారు. ఆ ప్రయత్నంలో కోరన్న, మంగన్న అమరు లయ్యారు. ఈ లెవిడి ఘటన స్త్రీల చొరవకు ఒక ఉదాహరణ. దళాల్లో స్త్రీలు ఎంతో చొరవతో వ్యవహరిం చారు. పంచాది నిర్మల, సంపూర్ణమ్మ, పురి రమణయ్య, తామాడ చంద్రమ్మ, మేడవరపు రామసీత, వరలక్ష్మీ నాయకులుగా ఎదిగా రు. పోరాట ప్రతిఘటనల్లో చురుగ్గా పోల్గొంటూ నిర్మల, అంకమ్మ, సరస్వతి అమరులయ్యారు. స్త్రీల సంఘటిత శక్తికి, ఉద్యమ కార్యాచరణకి, సాహసానికి, లక్ష్య సాధనపై గరికి, త్యాగాలకి, అమరత్వానికి, పోరాటానికి ప్రతీకగా మహిళలు శ్రీకాకుళ సాయుధ పోరాటంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చి చిరస్ధాయిగా మిగిలిపో యారు.
4 అంతర్జాతీయ మహిళా దశాబ్దం స్పూర్తి
ఐక్యరాజ్యసమితి 1975-85 మధ్య కాలాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా గుర్తించింది. ఈ దశాబ్దం 1975 మెక్సికో సమావేశంలో మొదలై, 1985 కెన్యాలో నైరోబీతో అంతమైంది. ఈ సందర్బంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్త్రీల స్థితిగతుల మీద ఒక నివేదిక విడుదల చేసింది. దాని సారాంశం- అబివృద్ది కోసం మహిళలు చేసే కృషిపై సరైన అంచనా లేదు. వారి శక్తి సామర్ద్యాల మీద కూడా సరైన అంచనా లేదు. ఉద్యోగం, విద్య, సామాజిక స్థాయీ వారి ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తున్నాయి. ఆర్ధిక వనరులు, రాజకీయాధికారంలో భాగస్వామ్యం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరు స్తాయి. ఈ నేపథ్యంలో, అన్ని హక్కులు స్థంచించిపోయిన ఎమర్జె న్సీ కాలం తర్వాత మళ్లీ మేల్కొన్న మహిళలు కొత్తగా కర్తవ్యాలను నిర్దేశించుకున్నారు. ‘స్వాతంత్య్రం’ తర్వాత విద్య, ఉద్యోగం, రాజకీయ, సమానత్వం అనే కలలు నెరవేరతాయనడం కల్ల అని తేలిపోయాక క్రియాశీల పోరాటాలు, ‘నిర్మాణాత్మకమైన’ కార్యాచ రణ చోటు చేసుకున్నాయి. పర్యాకరణ విధ్యంసం, సజీవకలో అస్థీర త్వం, బాలబాలికల పట్ట వివక్ష, పెరుగుతున్న పేదరికం, స్త్రీలపై అత్యాచారాలు స్త్రీలని కదిలించాయి. స్త్రీల సమస్యలపై ఆందోళనల ఎమర్జెన్సీ తర్వాత ప్రభుత్వం విధానాల వ్యతిరేక ఆందోళలనలుగా రూపుదిద్దుకున్నాయి. వివిధ సమస్యలపై పోరాటం: మహిళలు కేవలం శరీర స్పృహతో కాక సమాజంలో ఒక భాగంగా అనేక సమస్యలపై తమ నిరసన తెలిపారు. వీరు వ్యక్తిగతమే రాజకీయం అనే ఫెమినిస్టు పోకడలకి విరుద్దంగా తోటివారి సమస్యలను తమవిగా భావించి ఉద్యమించారు. అందుకే అలాంటి మహిళల పోరాట పరిధి విస్తృతమైంది. అలాంటి పోరాటాలు కొన్నిటిని చూ ద్దాం. పోరాట క్రమంలో హక్కులనేవి రాజకీయ దృవీకరణలు అన్న మనోరంజన్‌మొహంతి మాటలకు దివి నిదర్శనలు. ఈ పోరాటాలు ఎక్కువగా విద్యార్థులు, దిగువ మధ్యతరగతి వర్గాలను కదిలిం చాయి. ఎమర్జెన్సీకి ముందు, వెనక అనేక పాక్షిక పోరాటాలు జరిగాయి. స్త్రీలని వేధిస్తున్న అనేక రోజువారీ సమస్యలపై ఎన్నో క్రియాశీల పోరాటాలు చేశారు. అధిక ధరలకు వ్యతిరేకంగా: బొంబాయి, గుజరాత్ వంట చోట్ల అధిక ధరలకు వ్యతిరేకంగా ఉద్యమం విద్యార్ధి ఉద్యమంగా ఆరంభమై, మధ్యతరగతిని కదిలిం చింది. మూకుమ్మడి నిరాహార దీక్షలు, ప్రభాత భేరీలు, నకిలీ శవదా నాలు జరిగాయి. మన రాష్ట్రంలో కూడా అనేక ర్యాలీలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణ కోసం: చిప్కో ఉద్యమంలో స్త్రీలు గణనీయంగా పోల్గొన్నారు. కాంట్రాక్టర్లు చెట్లని నరుకుతుంటే అడ్డు కున్న స్త్రీలు ఆ చెట్ల చూట్టూ చేతులు చుట్ట వాటిని పొదివి పట్టుకుని, పర్యావరణం కోసం గోడ్డలి దెబ్బలకు సైతం సిద్దపడ్డారు. పర్యావరణ పరిరక్షణ డిమాండ్ నేడు ప్రముఖంగా వినబడుతుంటే, ఆనాడు 1973లోనే వాళ్లు దాని కోసం ప్రణాలను పణంగా పెట్టడం విశేషం. స్త్రీలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా: 1978 మార్చ్‌లో ఒక రాత్రి సినిమా చూసి భర్తతో తిరిగి వస్తున్న రమిజా బీపై అడిక్‌మెట్ పోలీసులు అత్యాచారం జరిపారు. ఆమెని వేశ్యగా చిత్రించి, భర్తని కొట్టి చంపితే, రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులకి పైగా ఆందోళన కొనసాగింది. వారం రోజుల కర్ఫ్యూలో పోలీసుల లాఠీ తూటాలకు ఇరవై ఆరు మంది బలయ్యారు. ముక్తధర్ కమిషన్ పోలీసుల నేరాన్ని దృవీకరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ సందర్బంగా మన రాష్ట్రంలో మహిళలు వివిధ రూపాల్లో, నిరసనలు తెలుపుతూ ఒక కకొత్త ఒరవడిని సృష్టించారు. మధుర కేసుని కూడా వ్యతిరేకించారు. మధుర అనే పరహారేళ్ల ఆదివాసి బాలికపై పోలీసులు అత్యాచారం జరిపారు. అయితే, ఆమె ‘కన్య’ కాదని , ఆమెకి అప్పటికే ఒక కుర్రవాడితో సంబంధం ఉందని చెప్తూ కేసు కొట్టివేశారు. కానీ ఆందోళనల ఫలితంగా చివరికి ప్రభుత్వం రేప్ చట్టాన్ని సవరించింది. ఇంకా అనేక చోట్ల ఇలాంటి ఘటనలకు ప్రతిఘటనలు వెల్లువెత్తాయి. ఇద్దరు భిల్లు మహిళల మానభంగంతో షహాదా సమ్మె జరిగింది. భిల్లులు ఏర్పరుచుకున్న శ్రామిక సంఘటన నేతృత్వంలో వారు భూస్వాముల దోపిడీని వ్యతిరేకిస్తూ కూడా ముందుకు కదిలారు. విప్లవ గీతాలతో కదం తొక్కుతూ భూమిలేని కూలీలు సంఘటితమయ్యారు. మానభంగా లని వ్యతిరేకిస్తూనే, కట్నం చావులని నిరసిస్తూ రూప్‌కన్వర్ వంటి స్త్రీల సతిని ఖండిస్తూ, గృహహింసని వ్యతిరేకిస్తూ ర్యాగింగ్‌ని, ఈవ్ టీజింగ్‌ని తిప్పి కొడుతూ, అశ్లీల వాల్ పోస్టర్లని చించుతూ విద్యార్ధినులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తు ప్రదర్శనలు జరిపారు. అలా 1970,80వ దశకాల్లో పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా ఇంటా బయట వారు ఉద్యమించారు. ఈ సందర్బంగా విద్యార్ధినులు చురుకైన పాత్ర వహించడం చెప్పుకోద గిన ముందంజ. వీరు తర్వాత మహిళా సంఘాల్లోనే కాక, విప్లవ రాజకీయాల్లో సైతం క్రియాశీల పాత్ర నిర్వహించారు. ఆ తరం విద్యార్ధిరులే నేడు తర్వాత తరాన్ని ఉత్తేజపరుస్తూ ఎన్నో రాజ్యహింస వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహిస్తు న్నారు కూడా. వ్యక్తిగత చట్టాల్లో మార్పుకోసం: మధ్యప్రదే శ్‌లోని ఇండోర్‌కి చెందిన 62 ఏళ్ల షాబానో ఐదుగురు పల్లల తల్లి. 1978లో భర్త ఆమెని వదిలేశాడు. ఆమె కేసు 1985లో దుమారం లేపింది. ముస్లీం కుటుంబ చట్టం ప్రకారం భర్తకి ఆమెని వదిలేసే హక్కు ఉంది. కానీ స్త్రీకి ఆ హక్కు లేదు. షాబానో తనని, తన కుటుంబాన్ని పోషించుకునే ఆధారం ఏమీ లేకపోవడంతో, మనోవర్తి కోసం కేసు పెట్టింది. ఆ కేసు సుప్రీంకోర్టు చేరుకునే సరికి ఏడేళ్లు గడిచిపోయాయి. కులం, మతంతో సంబందంలేని విధంగా సుప్రీంకోర్టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం ఆమె మనోవర్తికి సమానమైన పరిహారం చెల్లించవలసిందిగా తీర్పు చెప్పింది. అయితే, ఓబైదుల్లా ఖాన్ అజ్మీ, సయ్యద్ షహాబుద్దీన్ వంటి ముస్లీం పెద్దలు ఈ తీర్పుని ఖండించారు. ముస్లీం వ్యక్తిగత చట్టాన్ని ఇది ఉల్లంఘిస్తుందని వారు భావించారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి, 1986లో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని బుట్టదాఖలు చేసింది. ముస్లీం మహిళల చట్టాన్ని ఆమోదించింది. దాని ప్రకారం నెలవారీ సొమ్ము చెల్లింపుకి బదులు ‘ఇద్దత్’ సమయంలోనే ఒకేసారి సష్టపరిహారంగా పెద్ద మొత్తాన్ని చెల్లించాలని చెప్పారు. దీనివల్ల స్త్రీల మనుగడ దుర్బరమవుతుందంటూ అన్ని వర్గాల మహిళలు నిరసన తెలిపారు. మతం మత్తు మందే కాక స్త్రీల అణచివేత సాధనం కూడా అని మరోసారి రుజువైంది.70వ దశకంలో స్వయం ప్రతిపత్తిగల మహిళా గ్రూపులు ఏర్పడసాగాయి. ఉదాహరణకి, అహ్మదాబాద్‌లో ‘సేవా’ సంస్థ 1972లో కార్మికోద్యమంగా మొదలయింది. మహిళలు తమ అనుభవాలు కలబోసుకునేవారు. ఉమ్మడిగా డిమాండ్లు ముందుకు తెచ్చేవారు. తమ పని పరిస్థితులని మెరుగు పరుచుకునేవారు. అలానే, 1974లో గుజరాత్‌లో నవనిర్మాణ్ ఉద్యమం అవినీతిని వ్యతిరేకించే విద్యార్థి ఉద్యమంగా మొదలయింది. అటు తర్వాత, హక్కుల కోసం, రాజ్యాంగ పాలనలో పాత్ర కోసం ఆందోళన చేశారు. కుల సమస్యని వ్యతిరేకించి, మతపరమైన మూఢ నమ్మకాలని ఎండగట్టారు. రాజకీయార్ధిక సమస్యలపైనే కాక, గృహహింసపై కూడా కేంద్రీకరించారు. 1974లోనే హైదరాబాద్‌లో ప్రగతిశీల మహిళా సంఘం(పిఒడబ్ల్యూ) లింగ వివక్షని వ్యతిరేకిస్తూచ, సమానత్వాన్ని కోరతూ ముందుకొచ్చింది.
డా. నళిని
– వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….