మాకు ప్రత్యేక రాష్ట్రం.. సీమాంధ్రకు ప్యాకేజీ

మాజీ ఎంపీ వినోద్‌
హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి) :
తెలంగాణకు కావాల్సింది ప్రత్యేక రాష్ట్రం తప్ప ఏ ప్యాకేజీలు పనికిరావని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా వస్తున్న ఊహాగానాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయడం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ ఊహాగానాలేనని ఆరోపించారు. తెలంగాణకు ప్యాకేజీలిస్తుందని చేస్తున్న ప్రచారం ఉతుత్తిదేనని పేర్కొన్నారు. తెలంగాణకు ఎలాంటి ప్యాకేజీలు అవసరం లేదన్నరు. తెలంగాణ ఇప్పటికీ వనరులను కలిగి ఉందన్నారు. మాకు కావాల్సింది కేవలం రాష్ట్రమేననే ఉద్దేశ్యంతో ఉన్నామన్నారు. ఏదైనా ప్యాకేజీలు ఇవ్వాల్సి వస్తే సీమాంధ్రకు ఇవ్వాలని సూచించారు. ఎందుకంటే సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు చేసుకోవడం, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్‌లతో పాటు పలు డైరెక్టరేట్‌ కార్యాలయాల నిర్మాణం అవసరం అవుతుందన్నారు. దీనికోసం వేల కోట్లు అవసరం అవుతాయని మాకు రూపాయి ఇవ్వకపోయినా  పర్వాలేదు రాష్ట్రం ఇస్తే తమవద్ద ఉన్న వనరులతో అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఏ విధంగా ప్యాకేజీలతో తెలంగాణను లెక్క కడుతారని నిలదీశారు. ఇప్పటివరకు కోల్పోయిన లక్షలాది కుటుంబాల ఉద్యోగాలు, వారు నష్టపోయిన వేతనాలు, ఇప్పటికి తరలించుకు పోతున్న వనరులు, దోచుకుంటున్న ఆస్థులకు ఏలెక్కన పరిహారం లెక్కిస్తారని కేంద్రాన్ని వినోద్‌ నిలదీశారు. ఎన్ని కోట్లిచ్చి తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అరికడుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఇప్పటికీి, అప్పటకి కూడా సొంత వనరులున్న ప్రాంతమేనన్నారు. తమకు కావాల్సింది కేవలం ప్రత్యేక రాష్ట్రం మాత్రమేనని కేంద్రానికి తెలియక పోవడం బాధాకరమన్నారు. ప్యాకేజీలు, తెలంగాణ వ్యక్తులకు చైర్మన్‌ పదవులు ఇచ్చి అరికడుతామనుకుంటే భ్రమే అవుతుందన్నారు. విద్యలో, నీళ్లలో, ఉద్యోగాల్లో, విద్యుత్‌లో అన్నింటికి మించి ఆత్మగౌరవాన్ని కూడా చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 4200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు నిర్మించే పరిస్థతిలో ఉన్నా  కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, వనరుల దోపిడీ వల్ల కరెంట్‌ కష్టాలు వచ్చాయన్నారు. తెలంగాణలోనే ఉన్న బొగ్గు, నీరు తరలించుకుపోయి ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టుకున్నారని, అయినా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలివ్వలేదని ఆరోపించారు. ఎన్టీపీసీని రామగుండంలో నిర్మించినా కూడా స్థానికంగా ఇవ్వాల్సిన వాటానుకూడా అందకుండా చేసింది ఈపాలకులేనని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న వనరులు, సంపదపై టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన రోజుల్లోనే పాటల ద్వారా వివరించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతం బిచ్చపు ప్రాంతం (బెగ్గర్‌) కానే కాదని, బిచ్చం పడేసే ప్రాంతమేనన్నారు. డబ్బులు ఇచ్చి తెలంగాణ ప్రాంతాన్ని కొందామనుకుంటే కేంద్ర కాంగ్రెస్‌కు గట్టిగానే గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కేవలం స్థానిక సంస్థలు వస్తున్నందునే పార్టీని మల్లీ రక్షించుకునేందుకే ప్యాకేజీలు, ప్రత్యేక రాష్ట్రం అనే ఊహాగానాలన్నారు.