మాటల రచయిత గణేష్‌ పాత్రో ఇకలేరు

2

సిఎం ప్రగాఢ సంతాపం
హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి)::ప్రముఖ  సినీ,నాటక రచయిత గణేష్‌ పాత్రో సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు, ఎన్నో

హిట్‌సినిమాలకు కధ, మాటలు రాసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కె.బాలచందర్‌ వంటి ప్రముఖ దర్శకుల మన్ననలు పొందగలిగారు.
ఈయన స్వస్థలం విజయనగరం జిల్లా, పార్వతీపురం.కొడుకు పుట్టాల నాటికతో ఆయనకు యావద్భారతదేశంలో కీర్తి లభించింది. ఆ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి మరియు దూరదర్శన్‌ లలో ప్రసారమైంది. 1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేష్‌ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం విూద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్‌ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు. ప్రస్తుతం చలన చిత్రాలకు కథలు, సంభాషణలు సమకూరుస్తున్నాడు.1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించాడు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీరంగానికొచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.”హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం” నిర్ణయం సినిమాలో పాట రాశారు.ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్‌ చిత్రాలు ఉన్నాయి.