మానసరోవర్‌ యాత్రికులకు ఊరట

న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి ):  మానస సరోవర్‌ యాత్రికులను పవిత్ర మానస సరోవరంలో స్నానాలు చేయకుండా చైనా అధికారులు అడ్డుకున్న వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. నిర్దిష్ట ప్రాంతాల్లో పవిత్ర స్నానాలకు తమను అనుమతించినట్టు భారత్‌ నుంచి బయలుదేరిన యాత్రికుల బృందానికి సారథ్యం వహిస్తున్న సంజయ్‌ కృష్ణ ఠాకూర్‌ మంగళవారం ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇందుకు మార్గం సుగమం చేసిన భారత ప్రభుత్వానికి, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ బృందంలో 70కి మందికి పైగా భక్తులు ఉన్నారని, తమను పవిత్ర మానస సరోవర్‌లో స్నానాలకు చైనా అధికారులు అనుమతించలేదని ఆరోపిస్తూ ఠాకూర్‌ సోమవారంనాడు ఓ ట్వీట్‌, అందుకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేశారు. అలాంటప్పుడు తమకు వీసాలెందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పవిత్ర స్నానాలు చేయకుండా ఆ ప్రాంతాన్ని వదలి పెట్టేది లేదని కూడా ఆయన అందులో పేర్కొన్నారు. దీనికి సుష్మాస్వరాజ్‌ స్పందిస్తూ, విషయం కొంత భిన్నంగా కనిపిస్తోందని, నిజానికి నిర్దిష్ట ప్రాంతాల్లోనే పవిత్ర స్నానాలు చేయాల్సి ఉంటుందని, ఎక్కడపడితే అక్కడ చేయడానికి అనుమతి ఉండదని చెప్పారు. ఈ క్రమంలోనే చైనా అధికారులు తమకు నిర్దిష్ట ప్రాంతాలు కేటాయించినట్టు ఠాకూర్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.