మానసిక పరివర్తన మానవత్వ కాంక్ష, విశ్వసమతా భావన కోసం ఏర్పడిన ట్రస్ట్ “విశ్వ సాహితీ”

 మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే కళారూపాలను అందించే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ రేపటి తరం ఆలోచనలను అనుబంధాలకు విలువనిచ్చేలా నిర్మించడం కోసం నిరంతర యజ్ఞాన్ని మొదలెట్టింది.  మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు, మానవీయ విలువల్ని సుసంపన్నం చేసేందుకు, అనుబంధాలు, ఆత్మీయతలను మనసు నిండా నింపేందుకు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను  నేటి తరం ద్వారా రేపటి తరం హృదయానికి హత్తుకునేలా పరిచయం చేసేందుకు  శ్రీకారం చుట్టింది. జీవన విలువల్ని సుసంపన్నం చేసేందుకు, సన్మార్గాన్ని సమాజానికి చూపేందుకు, భారతీయ సంస్కృతి భావితరాలకు పంచేందుకు విశ్వ సాహితీ ట్రస్ట్‌ కళాయజ్ఞం చేస్తుంది. ఇందులో భాగంగా …
విశ్వ సాహితీ  ట్రస్ట్ ఈనెల 27న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు..1. మంచి భావనలు కలిగించే శతకాలను జన బాహుళ్య భాషతో మన అనుభవ సారంగా తీసుకొచ్చి వాటిని ‘సరళ శతక’ సాహిత్యంగా మలచటం జరిగింది. వీటికి అత్యంత వ్యాప్తిని చేకూరుస్తూ సుమారు 200 సరళ శతకాల వరకు అనుసరించగలిగేలా స్ఫూర్తిని కలిగించింది. ‘సరళ శతక’ రచయితలకు సీనియర్ ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారి తండ్రి గారు అయిన కీ. శే. శ్రీ. బుర్రా నారాయణ గారి పేరు మీదుగా పురస్కారాలను అందించనున్నారు. బుర్రా వెంకటేశం గారి స్పూర్తితో, వారిని అనుసరిస్తూ సరళ శతకం రచించిన తొలి రచయిత, కాళోజీ  పురస్కార గ్రహీత శ్రీ కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక పురస్కారం
2. ‘అనుబంధమే అసలైన మానవీయ గంధం’గా నమ్ముతూ కూలిపోతున్న కుటుంబ బంధాలను నిలబెట్టాలన్న తపనతో ‘సూక్ష్మ కావ్య’ ప్రక్రియను ప్రవేశపెట్టారు బుర్రా వెంకటేశం ఐ.ఎ.ఎస్‌. గారు. వారిని అనుసరిస్తూ అనేకమంది సూక్ష్మ కావ్యాలు రాశారు. అనుబంధాల వైపు దృష్టిని సారిస్తూ మళ్ళీ ఒక్కసారి ఆ తీపి జ్ఞాపకాలను అక్షరబద్ధం చేశారు. దాదాపు 400 సూక్ష్మ కావ్యాలు రాగా అందులో నుండి 347 వరకు ప్రచురించబడడం ముదావహం. ‘సూక్ష్మ కావ్య’ రచయితలకు బుర్రా వెంకటేశం గారి మాతృమూర్తి కీ. శే. శ్రీమతి బుర్రా గౌరమ్మ గారి పేరు మీదుగా పురస్కారాలు
3. ‘అమ్మ చేసిన బొమ్మను నేను’ సూక్ష్మ కావ్య ప్రక్రియ లో ఆది కావ్యం. ఈ ప్రక్రియ సృష్టికర్త, రచయిత  బుర్రా వెంకటేశం ఐ.ఏ.ఎస్‌.గారు. ఆ కావ్యానికి స్పందించి చరణ్‌ అర్జున్‌ సంగీత స్వరాలు చేకూరిస్తే అది విపరీతంగా జనాభిమానాన్ని చూరగొంది. దాన్ని చూసి ఎందరో పిల్లలు తమంత తాముగా నృత్యాలు చేస్తూ ఆ పాటను తమ కుటుంబ సమావేశాల్లో కూడా పాడటం చేస్తుండటంతో స్పందించిన విశ్వసాహితి ఆ పాట మీద నృత్యాలను ఆహ్వానించింది. ప్రకటించిందే తడవుగా దాదాపు 200 వరకు ‘వీడియో నృత్యాలు’ అందుకుంది విశ్వసాహితి ట్రస్ట్‌. వీటిలో ఎంపిక చేసిన వాటికి  ప్రథమ బహుమతి 50,000 , ద్వితీయ బహుమతి 25,000, తృతీయ బహుమతి 10,000లే కాకుండా బెస్ట్‌ కొరియోగ్రఫీ, బెస్ట్  డాన్స్ అవార్ట్ లు, ప్రోత్సాహ బహుమతులు
5. తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ. పూలతో పూలను కొలిచే విశిష్ట పండుగ. ఆ పండుగ వేళ తమ అక్క చెల్లెళ్ళ కోసం కొత్త పాటని అందివ్వాలన్న తలంపుతో ‘గునుగు పూవ్వుల్లో గౌరమ్మవై’ పాటను విడుదల చేసి, ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సౌజన్యంతో విస్తృత ప్రచారం కల్పిస్తూ వీడియాలను ఆహ్వానించింది.  ఈ పాట మీద బతుకమ్మ ఆడిన వీడియో పంపితే చాలు సుమారు లక్షరూపాయల బహుమతిని అందిస్తామని సగౌరవంగా ప్రకటించింది. ఈ విభాగంలో 103 వీడియోల వరకు రావడం జరిగింది. దేశంనుంచే కాక రష్యా, అమెరికా, ఇండేనేషియా, ఖతార్‌ ల నుండి కూడా ఎంట్రీలు రావడం గమనార్హం. సాధారణ ప్రజలు, కళాశాలలు, పాఠశాలలు, డ్యాన్స్ అకాడమీలు, మారుమూల ప్రాంతాలు, జాతీయ, అంతర్జాతీయ, డాక్యుమెంటరీ, లఘు వీడియోలు (షార్ట్స్), బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ వీడియోగ్రఫీ లాంటి పలు విభాగాలలో  దాదాపు 2 లక్షల వరకు బహుమతులు
6. మరొక అనుబంధాల పాటను 3వ పాటగా ప్రజల ముందుకు తీసుకురానుంది.
భవిష్యత్ కార్యక్రమాలు..
1. ప్రపంచ సాహిత్యంలో మేలైన 100 గ్రంథాల్ని ఎంపిక చేసి వారిని మన తెలుగు వారికి సమీక్షా పూర్వక పరిచయ కార్యక్రమాలుగా అందించే ప్రయత్నంలో ఉంది.
2. లక్ష బాలకవులు లక్ష్యంగా పిల్లల్లో మాతృభాష పట్ల  ప్రేమని, సాహిత్యం పట్ల అనురక్తిని పెంచేందుకు అనేక పోటీలను నిర్వహిస్తుంది. 3. ప్రతి రెండు నెలలకొకసారి ప్రజల ముందుకొస్తూ మంచి సాహిత్యాన్ని, చక్కని సంగీతాన్ని, ఆకట్టుకునే నృత్యాలతో జనాలను అలరించే కార్యక్రమాలను అందించనుంది.
“పదాలు కావివి ప్రపంచ అనుబంధ వేదాలు
పాటలు కావివి పరిమళించే శాంతి నాదాలు”
అంటూ ప్రాచీన విలువలను, సంప్రదాయాలను విస్మరించకుండా, మానవ సంబంధాలకు పెద్ద పీట వేస్తూ ఆధునిక మానవుని ఆలోచనా మార్గాన్ని మార్చబోతుంది విశ్వసాహితీ ట్రస్ట్‌. కళారూపాలను ప్రజల జీవితాలకు చేరువచేసి అత్యున్నత నాణ్యమైన జీవన విలువల్ని అందిస్తూ ప్రశాంతి కేంద్రాలుగా సమాజాలు ఉండేలా చేయూత నందిస్తుంది.
పరీక్ష లేనిదే వ్యక్తుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి రాలేవు కాబట్టి పోటీలు పెట్టి విద్యార్థులను, యువతను, మహిళల్ని, సంస్థలను ఆకర్షిస్తూ లక్షల రూపాయల బహుమతులతో చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.  వీడియో షూట్ చేసి,  అప్లోడ్ చేసి, లైక్స్ కోసం, సబ్ స్క్రైబర్స్ కోసం ఎవరికి వారు ఎదురు చూసే ఘడియలు  లేకుండా … ” మీరు మంచి వీడియో  చెయ్యండి … మేము వేదిక  కల్పించి, వేలమందికి చూపించి విస్తృత ప్రచారంతో, బహుమతులతో ప్రోత్సహించే సరికొత్త వాతావరణానికి శ్రీకారం చుట్టింది విశ్వసాహితి.
2022 అక్టోబర్‌ 27వ తారీఖు ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు దాదాపు 12 గంటలపాటు నిర్విరామంగా వినోదాన్ని, అనుబంధాల్ని పంచుతూ తాము చెక్కిన కళారూపాలను మీ ముందుకు ఆవిష్కరింప చేస్తుంది. సృజనాత్మక నృత్యాలకు పురస్కారాలను అందించనుంది. సరళ, సూక్ష్మ కావ్యాలకు బహుమతుల ప్రదానం జరగనుంది. మనసు  దోచే సాహిత్యం … వీనుల విందైన సంగీతం … కనులకు హాయిని చేకూర్చే నృత్యాలతో వేదిక సిద్ధంగా ఉంది .
వేదిక : రవీంద్రభారతి మెయిన్‌ హాల్‌
తేది: 27/10/2022
ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు
ఈ కార్యక్రమం విశ్వసాహితీ ట్రస్ట్‌ది మాత్రమే కాదు విశ్వశ్రేయస్సును కాంక్షించే మనందరిదీ కూడా.
ఒక ఆలోచన ఒక జీవితాన్నే మార్చేస్తుంది. ఒక మంచి ఆశయం సుసమాజాన్ని నిర్మిస్తుందని బలంగా నమ్మే విశ్వసాహితీ ట్రస్ట్‌ చేస్తున్న ఈ వినూత్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.