మానసిక సమస్య వ్యాధి కాదు
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం పరిశీలించారు.వైద్యులు, సిబ్బందితో మాట్లాడి టోల్ ఫ్రీ నెంబర్ 14416 పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.ఐదు లక్షల వైద్య సహాయంతో కూడిన ఆభా కార్డులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారని తెలియజేశారు.అనంతరం రికార్డులు పరిశీలించారు.మానసిక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 కు ఫోన్ చేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారని అన్నారు. సిగరెట్ , మందు అలవాటు ఉన్నవారు , ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అతిగా ఆకలి, అనుమానం, కుటుంబ కలహాలు, విద్యార్థుల్లో పరీక్షల భయం , ఆకలి వేయకపోవడం , ఆత్మనూన్యతా భావం, చేసిన పనినే మరలా చేయడం తదితర సమస్యలు ఉన్నవారు ఈ నెంబర్ ను సంప్రదించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమ్యశ్రీ, స్టాఫ్ నర్స్ లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.