మామిడి రైతుల ఆశలు గల్లంతు
భారీగా నేలరాలిన పంట
ఆదిలాబాద్,మే4(జనం సాక్షి): ఉమమడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షబీభత్సంతో భారీగా మామిడిపంట దెబ్బతింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి.ఈ యేడు మంచి లాభాలు రాగలవని అంచనాలో ఉన్న రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. పలుచోట్ల మామిడి చెట్లకు మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నిలువచేసుకున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ వర్షం కురుస్తుందోనన్న ఆందోళనలతో కేంద్రాలకు పరుగెత్తి రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. అనేక గ్రామాల్లోని మామిడి తోటల్లోని కాయలు నేలరాలాయి. చేతికి వచ్చిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో పోసిన మొక్కజొన్నలు, వరిధాన్యం తడిసిపోయింది. రాసుల్లో వరదనీరు చేరింది. అందుబాటులో ఉన్న రైతులు తమపంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పిన ఫలితం లేకుండా పోయింది. ఈదురు గాలికి వేసిన టర్పాలిన్లు కొట్టుకు పోయాయి. అకాలవర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాట్లిల్లింది. పంటపొలాల్లో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడిసిముద్దయింది. కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు లారీల్లో తరలించేందుకు సిద్ధంచేసిన ధాన్యం సైతం తడిసిపోయాయి. వరిధాన్యంతో పాటు మిర్చి పంటకు అపార నష్టం వాటిల్లింది.