మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు

కాకినాడ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పిస్తామని యనమల చెప్పారు. అన్ని మతాల పర్వదినాల్లో కూడా చంద్రన్న కానుక ఇచ్చేందుకు 18రోజుల పాటు జరిగే బడ్జెట్‌ సమావేశల్లో చర్చిస్తామని మంత్రి అన్నారు. ఇదిలావుంటే త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో మొదటి విడతగా రూ. 948 కోట్లతో పనులు ప్రారంభించామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి పి. మాణిక్యాలరావు అన్నారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వస్తున్న ఆయన రావులపాలెంలో కొద్ది సేపు ఆగి విలేకర్లతో మాట్లాడారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో పనులు ఇప్పటికే ప్రారంభించామని, ఈ పుష్కరాలకు సుమారు 4కోట్ల జనాభా రానున్నట్లు అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. వీరికి వసతులు, భద్రత, ట్రాఫిక్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.