మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీపై ఆధారాల్లేవట!?
– ఎన్‌ఐఏ క్లీన్‌చీట్
– ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన
ముంబై,మే13(జనంసాక్షి):మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు ఎన్‌ఐఏ క్ల్లీన్ చీట్ ఇచ్చింది.ఇందులో ఆమె ప్రమేయంలేదని తేల్చింది. దీనిని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు స్వాగతించారు. ఈ కేసుతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు ఎటువంటి సంబంధం లేదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బీజేపీ అధికార ప్రతినిధి, లోక్ సభ ఎంపీ విూనాక్షి లేఖి అన్నారు. సాధ్వికి క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా సాధ్విని ఈ కేసులో ఇరికించారని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ ఆరోపించారు. పథకం ప్రకారం దేశభక్తులను అప్రదిష్టపాల్జేస్తున్నారని విమర్శించారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రమేయం లేదని ఎన్‌ఐఏ చార్జిషీటులో పేర్కొందని, దీంతో ఆమెపై పెట్టిన కేసు ఉపసంహరించబడుతుందని డిఫెన్స్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. మాలెగావ్ పేలుళ్ల కేసుపై రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. సాధ్వితో పాటు 12 మంది నిందితులపై ‘మోకా’ కింద పెట్టిన అభియోగాలను ఎన్‌ఐఏ ఉపసంహరించుకుంది.ఇదిలా వుండగా మాలెగాల్ బాంబు పేలుళ్ల కేసులో
సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ఎన్‌ఐఏ క్లీీన్‌చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తులో ఎన్‌డీఏ ప్రభుత్వం జోక్యం చేసుకుందని వారు విమర్శించారు.ఎన్‌ఏఐ దర్యాప్తును మోదీ ప్రభుత్వం ప్రభావితం చేయడంపై వారు మండిపడ్డారు.