మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌ అరెస్టు

మాలె : మాల్దీవ్స్‌ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ను మంగళవారం దేశరాజధాని మాలలో పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా మాలెలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. న్యాయస్థానం ఆయనపై మూడోసారి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంతో అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. నషీద్‌ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తిని అరెస్ట్‌ చేయమని సైన్యానికి విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గత నెలలో రెండు సార్లు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయినప్పుడు నషీద్‌ మాలెలోని భారత రాయబార కార్యాలయంలో 11 రోజులు తలదాచుకున్నాడు. అయితే ఈ కేసు రాజకీయ దురుద్దేశపూరితమని, ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఆయనపై కేసు పెట్టిందని ఎమ్‌డీపీ ఆరోపించింది. కాగా, ఏమాత్రం వివరణ ఇవ్వకుండానే నషీద్‌ను పోలీసులు తీసుకెళ్లారని, ఆ పార్టీ అధికార ప్రతినిధి హమీద్‌ అబ్దుల్‌ గఫూర్‌ తెలిపారు.