మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ
మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం
హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) :
తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని హైదరాబాద్‌లోని పారిశ్రామివాడ కార్మికులు నినదించారు. శనివారం వారు స్థానిక పరిశ్రమల్లో తెలంగాణవాసులకు ఉద్యోగాలివ్వడంలో వివక్ష చూపుతున్నారని మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను తెలంగాణ జేఏసీ కోదండరాం ప్రారంభించారు. చీర్లపల్లిలోని పారిశ్రామికవాడలో టీఎఫ్‌ఎస్‌ఈఏ, టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, ఉపాధ్యక్షులు చిలుక సంజీవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహా, కార్యదర్శి శంకర్‌, కృష్ణ, దశరథ్‌ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో కోకొల్లలుగా పరిశ్రమ లు ఏర్పాటు చేస్తూ, ఇక్కడి భూములను కొల్లగొ డుతున్న సీమాంధ్రులు, ఉద్యోగాల కల్పనలో వివక్షను చూపుతున్నారని ఆరోపించారు. తమ తమ ప్రాంతాల నుంచి అర్హత లేకున్నా అభ్యర్థులను దింపుతూ, అర్హత ఉన్నా స్థానికులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే స్థానిక అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు చేసినా సీమాంధ్ర యాజమాన్యం పెడ చెవిన పెడుతున్నదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి, స్థానికులకు అవకాశమివ్వాలని లేకుంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్మిక చట్టాలను గౌరవిస్తూ ఈ నిర్ణయాలు తీసుకోవాలని రాములు హితవు పలికారు. లేకుంటే, కంపెనీల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీజీఓల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ జేఏసీ కన్వీనర్‌ కృష్ణయాదవ్‌, టీపీయూఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దామగిరి ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.