మా తాత తెచ్చే ఉసిరికాయలు ఎక్కడ?
లేబర్ కాలనీ అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి ఖాళీ చేసి చేసి పిన్న వారి వీధిల ఉండబట్టి ఒక ఆరు నెల్లు అయిందేమో? ఆదివారం వ చ్చిందంటే సాలు రికాము లేకుంట అడిగేది మమ్మిని ‘లేబర్ కాలనీ అమ్మమ్మ వాళ్ల ఇంటికి పోతనే’ అని. సొంత అమ్మమ్మ కాకపో యినా, అమ్మమ్మకు పెద్దమ్మ బిడ్డ, లేబర్ కాలనీల ఉంటది కాబట్టి ఆ పేరు తోటిప్రేమగా పిలుసుకునేది. మరి లేబర్ కాలనీకి ఆ పేరెందుకొచ్చింది? మిల్లుల పని చేసెటోళ్లందరూ ఆడ ఉంటరు కాబట్టి ఆ పేరు వచ్చిందేమో? ఇంతకీ లేబర్ కాలనీ అమ్మమ్మ పేరు చెప్పలే కదా.. వీరమ్మ తాత పేరు కనకయ్య.గాంధీ తాత మిల్లు గ్రౌండ్‌కు వచ్చినప్పుడు అమ్మమ్మకు పెళ్లైందని చాన పెద్దగైనంక గాని తెల్వలే నాకు. రజాకార్లు చింతల్‌కి వచ్చినప్పుడు ఇర్వై, ఇర్వై మూడేళ్లుండెనట అమ్మమ్మకు. తాత మొదట్నుంచి మిల్లులనే పనిజే సేది. సాంచలు రిపేర్ చేసేదంట. నేను పుట్టినప్పటి నుంచి వాళ్ల ఇంట్లనే కిరాయికి ఉన్నం మేము. ఓ నాలుగైదేళ్లు నాకు సొంత అమ్మమ్మ కంటే ఎక్కువ ఇష్టముండే లేబర్ కాలనీ అమ్మమ్మ. రోజు రాత్రి నా ఆస్మాన్ రంగు మెత్త తీస్కొని పోయి, అమ్మమ్మ నవార్ మంచాన్ని కడ్పలేసుకొని పండుకునేది, నిద్రపట్టేదాంక ఈపు గోకిచ్చుకునేది. ఎప్పుడన్న అర్ధరాత్రి తెలివి బడితె మెత్తను సంకల పెట్టుకొని నడుసుకుంట పొయ్యి డాడి దగ్గెర పండుకొనేదని అందరూ ఏడిపిచ్చేటోళ్లు.నేను లేబర్ కాలనీ అమ్మమ్మను రోజు యాది జేసుకునుడు చూసి మమ్మి బతిలాడంగ, ఒక రోజు ఆదివా రం పొద్దున్నే తయారు జేసుకొని, ఊరికి పోవుకుంట నన్ను దార్ల లేబర్ కాలనీల దింపిపోయిండు డాడి. పోయే సరికి అరుగు మీద కూసొని ఎల్లిపాయలు దీసుకుంటున్నది అమ్మమ్మ. నన్ను సూసేసరికి పానం లేశొచ్చినట్టై చాట పక్కకు పడేసి కావలిం చుకున్నది. నేను వచ్చిన అని పక్కింటి మల్లేశం తోటి తాతకు మతలాబు పంపింది. ‘పొద్దుటి పైలికి పోయిండు ఇంకో గంటకు వస్తడు తాత మనం ఇంటెనుకకు పోదాం పా’ అని తోసు కుపో యింది. ఇంటెనుకకు పోయేసరికి ఏదో ఎలితి అనిపిచ్చింది. బాయికి ఆనుకున్న గోడెంబడి ఉన్న చింతచెట్టు మాయం అయింది. మొత్తం మూడు చింతచెట్లు ఉంటుండె. మేము ఉన్నప్పుడు ఓ రెండు కొట్టేశిండ్రు. ఇప్పుడు మిగిలింది గూడ పోయింది. ఎండకా లం వస్తే ఆ చింత చెట్ల కిందనే పండుకునేది. చింతకాయలు కొట్టుకొని, చిగురు తెంపుకొని, జామాకుల చింతపండుతోటి కలిపి పెట్టుకొని పాన్ ఏసుకునేది పోరగాళ్లమంత. దానిమ్మ పండ్లు, పరికి పండ్లు, టమాట పండ్లు.. ఏమీ లేకపోతే ఇంకో మూలకున్న యాప పండ్లు తింటుండే. చింతచెట్లు తప్ప అన్ని ఉన్నాయి హమ్మయ్యా అనుకున్న. చిల్కలు కొడుతయని అమ్మమ్మ దానిమ్మ కాయలకు, జామకాయలకు గుడ్డపేల్కలు గట్టేది, వాటిని ముట్టుకుంటే మాత్రం ఈపు యిమానం మోతమోగేది.
‘అమ్మమ్మా జాంకాయలు ఉన్నయానే, గుడ్డపేల్కలు కనిపిస్తలేవు చెట్లమీద?’
‘ఏడరా! పేల్కలు ఎత్తుకొని తినబట్టె చిలుకలు, గా అవుతలి చెట్టుకు మొన్న కొన్ని పిందెలు కానొచ్చినయి సూద్దాం పా’ అనుకుంట బాయి పక్కెంబడి ఉన్న బొంగు తీస్కొని చెట్టు కిందికి బోయి, కండ్లకు చెయ్యి అడ్డం బెట్టుకొని సూడవట్టింది. ‘అమ్మమ్మా! పైన కొమ్మకున్నదే దోర పండు’ అమ్మమ్మకు పండు కనబడక ముందే నేను చెట్టు ఎక్కి తెంపుకున్న. ‘అరే! పైలంరా వారీ, దెబ్బ తలిగిచ్చుకుంటే మీ అయ్యకు నేను ఏం జెప్పుకొవాలె?’ అనుకుంట పిర్రమీద ఒకటి సరిశింది. ‘కడుక్కోని తినురా’ అనేలోపే నేను రెండూ మూడు బుక్కలు కొరికేశిన. మిగిలిన కాయ తినుకుంట మూలకు నిలబెట్టి ఉన్న కట్టెల దిక్కుబోయిన, చిన్నప్పుడు పాములు ంటయని ఇటు రావాలంటే భయమయ్యేది.
‘అరే! పైలంరా గుంజలు మీద బడుతయి’
‘అమ్మమా? తాతకు ఉశిరికాయలు తెమ్మని జెప్పినవానే?’
నవ్వి ‘ఇంతకు మునుపుయ మల్లేశం పోయెటప్పుడు చెప్పిన తియ్యిరా తెమ్మని … ఇంకా మరువలేదారా ఉశిరికాయలను?’
ఎట్ల మరుస్త! వచ్చిందే వాటికోసమాయె! రోజు మూడు గంట్లకు సైరన్ ఇనబడంగనే సాలు పోయి అరుగు మీద కూసొని మెయిన్ రోడ్ మీద మలుపు తిరిగే సైకిళ్ల దిక్కు సూసుకుంట కూసునేది. మిల్లు క్యాంటిన్ అవుతల చిన్న ఉశిరికాయల చెట్టు ఉండేది. రోజు తాత డ్యూటీ దిగంగనే కింద పడ్డ పండ్లన్నీ ఏరి దస్తీల మూట గట్టుకొని తెచ్చి అరుగుమీద పరిశి…
‘గుడ్లగూబ కండ్లేసుకొని ఎట్ల సూస్తుండు సూడు’ అని పరాశికం ఆడుకుంట దెగ్గరికి తీసుకునేటోడు.
‘ఇంకెప్పుడొస్తడే తాత?’
‘జర్రాగురా బిడ్డ ఒస్తడుగని’
‘ప్రసాదముల్లా! ప్రసాదం’ అని అరుపు ఇనవడ్డది
‘ఇగ వో! మీ అత్త ప్రసాదం పెడుతాంది’ అంటుండంగనే ఇంటెనుక దర్వాజ తీసుకొని ఆనంగ ఉరికిన.
మా మేనత్త. రోజు పూజ అయిపోంగనే, అర్టిపండు, కుడుక ముక్కలల్ల శెక్కరేశి, ప్రసాదం పంచేది. అప్పటిదాంక వాడంత ఖాళీగా కనబడేది. ‘ప్రసాదం’ అని ఇనంగనే ఈగల లెక్క ముసిరేది వాడ మీది పోరగాల్లంత. ఈసారి ప్రసాదం ఒడువక ముందే అందరి కన్న ముందుబోయి లైన్ల నిలబడ్డ. చేతుల బెట్టిన ప్రసాదం తిన్నంక ఇంకొంచం అడిగిన. ఎవలో వాడ మీద పిలగా డని ముందు కోపంగ సూశినా, ఎంబడే ఏర్పాటు చేసి ‘ఎప్పు డస్తివిరా జయా?’ అనుకుంట చెంపలమీద ఓ వంద ముద్దులు పెట్టినట్టుంది. ప్రసాదం పంచుడు అయిపోయినంక తాంబాలం కడిగి, లోపలికి పోయి హార్లిక్స్ కలుపుకొచ్చింది. అత్తోళ్ల తప్ప నాకు ఏడ హార్లిక్స్ తాగనీకి లేకుంపోతుండె. ఇంటి ముందట మామ కూసునే ఆరాం కుర్సీ ఖాళీగ కనబడితే దాంట్ల కూసొని, ఇంటి ముందట ఉన్న జాజిపూల పందిరి దిక్కు సూసుకుంట, ఉడుకు పా లు సాసర్‌ల పోసుకొని తాగుతున్న. రాజ్‌దూట్ ఇంటి ముందట ఉన్నదంటే మామయ్య ఇంట్లనే ఉన్నడన్న మాట! అనుకొని కప్పు వంట రూంల పడేసి మెల్లగ బైటికి వచ్చి పందిరి కింద ఆడుకుంట, మా బావ అంబి కోసం దేవులాడుతుంటే తాత సైకిల్ కనబడి రయ్యిన ఏనుక బడి ఉరికిన. ఉరుక్కుంట మూల తిరుగుతుంటే దబ్బున ఏదో తాకి కిందబడ్డ, ఎంబడే లేసి దులుపుకొని తాత దిక్కు ఉరికిన. స్టాండ్ సరిగ్గ పడక సైకిల్ కింద పడ్డది. కోపంతోటి మల్ల స్టాండ్ ఏస్తుంటే ఎనుక నుంచి పొయ్యి తాతను గట్టిగ పట్టుకున్న. కోపంతోటి తాత గట్టిన నూకితే పొయ్యి అంత దూరంల పడ్డ. అది సూశి అమ్మమ్మ ఇంట్ల నుంచి ఉరికొచ్చి
‘పిల్లగాడు ఎండలబడి వస్తే గట్ల తంతివేందే వాన్ని’ అన్నది’ఒక దిక్కు నౌకరీ పోయి నేను ఏడుస్తుంటే పండ్లు గావాల్నానే వీనికి…’ అనుకుంట ఇంటెనుకకు పొయ్యి ఇత్తడి చెంబుల నీళ్లు కాల్ల మీద పోస్కొని గోడకు ఇస్సిరి కొట్టిండు. ‘అయ్యో పొలగానికి నెత్తురు కారుతాంది గాదే’ అని అమ్మమ్మ అనంగనే ఇంటిముందటికి ఉరికచ్చి ఇంటిమూల మీద బోరింగ్ దిక్కు సూశిండు. బోరింగు హ్యాండిల్ మీది నుంచి రక్తం కారుతుంటే సూశి ‘ఈ హౌలా గాళ్లకు ఎంత జెప్పినా గాని పంపు కొట్టుకున్నంక హ్యాండిల్ కిందికి అనరు… అయ్యో బిడ్డా ఎంతపనై పాయెరా’ అనుకుంట జేబుల నుంచి ఉశిరికాయల దస్తీ మూట తీసి తాత నా చేతిల పెట్టిండు. అప్పటి వరకు ఉత్తగ ఉన్న నాకు బడబడా కండ్లెంబడి నీళ్లు గారినయి.
ముప్పై అయిదేళ్ల తరువాత…
హై చెయిర్ మీద కూసున్న సంవత్సరంన్నర పాప బ్లూ బెర్రీస్ తినమంటే తినకుంట పిసికి కింద సల్లుతుంది
‘బాంచనే బిడ్డా తినరాదు! నీకు ఇష్టంగదా స్ట్రాబెర్రీస్ కోశియ్యాల్నా’ అనంగనే
‘నొ…నో!!నో!!! అనుకుంట గిన్నె కింద పడేసింది.
‘సిక్ ఇండస్ట్రీస్’ అన్న పేరుతోటి కొన్ని లక్షల మందికి (ప్రత్యక్షంగానో, పరోక్షంగానో) జీవనాధారమైన మిల్లులు ఎన్నో తెలంగాణల మూసేసిండ్రు. వరంగల్‌ల నర్సంపేట రోడ్ మీదున్న అజంజాహీ మిల్లు ఆ ‘సిక్ ఇండస్ట్రీస్’ల ఒకటి. పదిహేడేళ్ల కిందట అజంజాహీ మిల్లు మతబడ్డంక ఇప్పుడు వరంగల్లు ఆర్థిక అభివృద్ధి చెందుతున్నా, ఆ దెబ్బకు చెల్లాచెదురైన జీవితాలు మాత్రం కాదేమో!?
– జయప్రకాశ్ తెలంగాణ
షషష.టaషవపశీశీస.షశీఎ/్‌వశ్రీaఅస్త్రaఅa
యజూ.్‌వశ్రీaఅస్త్రaఅaఏస్త్రఎaఱశ్రీ.షశీఎ