మా వారి జాడ చెప్పండి?

బంధువుల వేడుకోలు
ప్రతికూల వాతావరణంలో
అరకొర సాయం
కేదార్‌నాథ్‌లో కుండపోత వర్షం
నాలుగో రోజు అదే తీరు
డెహ్రాడూన్‌, జూన్‌ 27 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌లో వరుణుడి ప్రళయానికి కనిపించకుండా పోయిన తమవారి జాడ చెప్పడంటూ బంధువులు కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నారు. డెహ్రాడూన్‌ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో తమ వాళ్ల ఫొటోలతో తిరుగుతూ వాళ్లక్కెడా కనిపించారా అని అడుగుతున్నారు. నీళ్లు నిండిన కళతో వారు అభ్యర్థిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. అసలు ఉన్నారో లేదో ఉంటే ఎలా ఉన్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్న వారి జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు వెదుకులాడుతున్నారు. ఏదో ఒక చోట తమ వారు క్షేమంగా ఉంటారనే నమ్మకం వారి అభ్యర్థనల్లో తొణికిసలాడుతోంది. మరోవైపు వరద బాధితుల తరలింపు ప్రక్రియకు గురువారం కూడా విఘాతం కలిగింది. ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు వరుసగా నాలుగో రోజూ ఆటంకం ఏర్పడిరది. భారీ వర్షాల వల్ల హెలికాప్టర్లు డెహ్రాడూన్‌కే పరిమితమయ్యాయి. వాతావరణం కొద్దిగా అనుకూలించడంతో హర్సిల్‌, బద్రీనాథ్‌లో చిక్కుకున్న వారిలో కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్సిల్‌లో సహాయక చర్యలు దాదాపు పూర్తి కావొచ్చాయి. మరోవైపు, కేదార్‌నాథ్‌లో కురుస్తున్న వర్షాలతో సామూహిక అంత్యక్రియలకు అంతరాయం కలిగింది. మరోవైపు, భారీగా కురుస్తున్న వర్షాలతో పితోర్‌గర్‌లోని కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తల్లిదండ్రులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
బద్రీనాథ్‌లో ఇంకా 3 వేల మంది
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల గురువారం కూడా సహాయక చర్యలు నిలిచిపోయాయి. వాతావరణం సహకరించకపోవడంతో హెలికాప్టర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బద్రీనాథ్‌లో ఇంకా మూడు వేల మంది యాత్రికులు చిక్కుకొని ఉన్నట్లు సైన్యం ప్రకటించింది. వాతావరణం అనుకూలిస్తే వారిని తరలించనున్నట్లు తెలిపింది. బద్రీనాథ్‌కు అన్ని వైపుల మార్గాలు మూసుకుపోవడంతో కేవలం వాయుమార్గం ద్వారానే వారిని తరలించాల్సి ఉంది. కానీ, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలు సాగడం లేదు. డెహ్రాడూన్‌లో వాతావరణం అనుకూలించక పోవడంతో బద్రీనాథ్‌లో చిక్కుకున్న వారిని వైమానికదళ హెలికాప్టర్లు చమౌలి జిల్లాలోని గౌచర్‌కు తరలిస్తున్నాయి. గౌచర్‌ నుంచి హరిద్వార్‌, రుషికేశ్‌, డెహ్రాడూన్‌లోని శిబిరాలకు తరలిస్తున్నారు. మరోవైపు కేదార్‌నాథ్‌నూ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేదార్‌నాథ్‌లో గాలింపు పూర్తి కావడంతో ఇండో టిబెటన్‌ సరిహద్దు దళాలు వెనక్కు తిరిగివచ్చేశాయి. కాగా, కేదార్‌నాథ్‌లో సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మళ్లీ వాయిదా పడిరది. వాస్తవానికి బుధవారమే సామూహిక అంత్యక్రియలు పూర్తి చేయాలని భావించినప్పటికీ, వర్షాల వల్ల వాయిదా పడిరది. ఘటన జరిగి దాదాపు రోజులు దాటడంతో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయాయి. దీనివల్ల అంటువ్యాధులు వ్యాపించే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, పూర్తిగా కలుషితమైన నదీ జలాలను ఎవరూ తాగవద్దని ఆరోగ్య శాఖ ప్రజలను హెచ్చరించింది. కేదార్‌నాథ్‌ పరిసరాల్లో కుళ్లిపోయిన మృతదేహాల నుంచి దుర్వాసన వ్యాపిస్తోందని, దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపింది. ‘వెలికితీసిన మృతదేహాలకు అంత్యక్రియలను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించక పోవడంతో చాలా మృతదేహాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. వాటి వద్దకు చేరేందుకు సహాయక బృందాలకు వాతావరణం అనుకూలించడం లేదని’ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న నోడల్‌ అధికారి రవికాంత్‌ రామన్‌ తెలిపారు. హర్సిల్‌ నుంచి మరో 208 మందిని తరలించారు. ఇంకా 600 మందిని తరలించాల్సి ఉంది. బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన వారిని తరలించడమే ఇబ్బందిగా మారింది. ప్రతికూల వాతావరణం కేవలం 350 మందిని తరలించారు. మరో 3 వేల యాత్రికులను తరలించాల్సి ఉంది. వాతావరణం అనుకూలిస్తే ఒకటి, రెండ్రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని ఎయిర్‌ కమాండర్‌ రాజేశ్‌ ఇస్సార్‌ తెలిపారు.