మిన్నంటిన రోదనలు ఆసుపత్రుల్లో ప్రముఖుల పరామర్శలు

హెదరాబాద్‌,ఫిబ్రవరి22(జనంసాక్షి):
దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఉదయం నుంచి ఈ ప్రాంతాన్ని పలువురు సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర¬ంమంత్రి షిండే, గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ¬ంమంత్రి సబిత, చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి చిరంజీవి తదితరులు సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. జంటనగరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మంత్రివర్గం సమావేశమై మృతులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. కొత్తపేట ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నల్గొండ జిల్లాకు చెందిన గిరి మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో గాయపడిన 119 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమందిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. గడ్డిఅన్నారం బస్తీలోని కమల, నిఖిల్‌, సిగ్మా, టీకేఆర్‌ ఆసుపత్రుల్లో 23 మంది చికిత్స పొందుతున్నారు. క్షత్రగాత్రులకు అందుతున్న వైద్య సేవలను సరూర్‌నగర్‌ రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుంటే బాంబు పేలుడు ధాటికి పలువురి వినికిడి శక్తి కోల్పోయారని వైద్యులు తెలిపారు. వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఆసుపత్రుల్లో మిన్నంటిన ఆర్తనాదాలు బాంబు పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులు నగరంలోని వివిధ    ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలు ఆసుపత్రుల్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి బంధువులతోనే ఆసుపత్రులు నిండిపోయాయి. మొత్తం ఈ ఘటనలో 119 మంది గాయపడగా.. అందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరి బంధవులు సమాచారం అందుకుని రాత్రికి రాత్రి నగరానికి చేరుకున్నారు. యశోద ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారని ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేర్‌ ఆసుపత్రిలో 20 మంది చికిత్స పొందుతుండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓవ్నిూ ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతండగా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

గర్భం కోల్పోయిన మహిళ : గాయపడ్డ వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో బాధగాఉంది.  బాంబు పేలుళ్లలో గాయపడిన 20 మంది తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కేర్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారిలో ఓ మహిళ గర్భం కోల్పోయిందని వెల్లడించారు. క్షతగాత్రుల్లో ఎక్కువమందికి వెన్నులోకి, ఇతర శరీర భాగాల్లోకి పేలుడు పదార్థాలు చొచ్చుకెళ్లాయని చెప్పారు. శస్త్రచికిత్స ద్వారా గాయాలు నయం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రి సిబ్బందే స్వచ్ఛందంగా రక్తదానం చేశారని చెప్పారు.

బంధువులకు మృతదేహాలు అప్పగింత

బాంబు పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులు ఉస్మానియా, కామినేని, యశోద, ఓవ్నిూ, కమలా, నాంపల్లి కేర్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉస్మానియాలో 10 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతిచెందిన 15 మందిలో 13 మందిని గుర్తించారు. బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది. మరో ఇద్దరి శవాలను ఉస్మానియా మార్చురీలో భద్ర పరిచారు. వారి వివరాలు తెలియాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతదేహాల కోసం 94906 16400 ఫోన్‌ నెంబర్లో సంప్రదించవచ్చని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

మృతుల వివరాలు వెల్లడి

ఎ.రాములు (వారాసిగూడ)

ఎజాజ్‌ అహ్మాద్‌( ప్రేమ్‌నగర్‌ అంబర్‌పేట, పాలిటెక్నిక్‌మొదటి సంవత్సరం విద్యార్థి)

మహ్మద్‌ రఫీ (బాబానగర్‌ , చాంద్రాయణగుట్ట బ్యాగులు కుట్టే వ్యక్తి)

ముత్యాల రాజశేఖర్‌(ఎంబీఏ) (ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్‌ గ్రామం)

వడ్డే విజయ్‌కుమార్‌ (ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్‌ గ్రామం)

హరీష్‌ కార్తీక్‌ (దిల్‌సుక్‌ననగర్‌ స్వగ్రామం జడ్చర్ల)

పద్మాకర్‌ దివాన్‌జీ (కొత్తపేట జిలేబి తయారీదారుడు)

వెంకటేశ్వర్‌రావు (వెటర్నరీ అసిస్టెంట్‌ మలక్‌పేట ,స్వగ్రామం దేవరకొండ)

స్వప్నారెడ్డి  (సంతోష్‌ నగర్‌ ఎంబీఏ విద్యార్థి)

ఆనంద్‌కుమార్‌ (బీటెక్‌ ఈసీఈ చివరి సంవత్సరం నోవా కళాశాల,  స్వస్థలం అనంతపురం జిల్లా, ప్రస్తుతం చైతన్యపురిలోని శ్రీ అంజేనేయ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు.)

తిరుపతయ్య (గోదావరిఖని),

శ్రీనివాస్‌రెడ్డి (రెంటచింతాల),

చోగారం కులాజీ(రాజస్థాన్‌)

కంట్రోల్‌రూం ఏర్పాటు

దిల్‌సుఖ్‌నగర్‌లోని జంట బాంబు పేలుళ్లలో గాయపడిన వారి వివరాలను తెలుసుకునేందుకు కంట్రోల్‌రూంను ఏర్పాటుచేసినట్టు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల వివరాల కోసం 040- 23261166, 27852333, 27852437 ఫోన్‌నెంబర్లకు చేసి తెలుసుకోవచ్చని వారు వెల్లడించారు.