మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
భారీగా నిల్వలు రావడంతో అధికారుల అప్రమత్తం
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మార్కెట్ సిబ్బంది
ఖమ్మం,మార్చి19(జనంసాక్షి): ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన సరుకును వచ్చినట్లుగానే కొనుగోలు చేసి పంపించే ఏర్పాట్లు చేశారు. రోజుకు సుమారు 40వేల నుంచి 60వేల బస్తాలు వస్తుండటంతో నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించి అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మరి కొద్ది రోజుల వరకు కూడా మార్కెట్‌కు భారీగానే వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోపల విక్రయాలు పూర్తయిన తర్వాత సకాలంలో లోపలి సరకును బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి తెల్లవారు జామునే తెస్తున్నందున వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. సోమవారం ఒక్కరోజే
సుమారు 80వేల మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఈసీజన్‌లో ఇంత పెద్ద మొత్తంలో నిల్వలు రావటం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన రైతులు తమ సరకు ఇక్కడ విక్రయించుకునేందుకు తెచ్చారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావటం, ¬లీ పండుగ కూడా దగ్గర పడుతున్న సమయంలో మిరప నిల్వలను ఎక్కువగా విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు కూడా పోటీపడి సరుకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటా మిరప గరిష్ఠ ధర రూ.9250 కాగా కనిష్ఠ ధర రూ.7500, నమూనా ధర రూ.8700లు పలికింది. మామూలు సరకు కూడా రూ.7500పైనే ధర పలికింది. గతంలో ఒకే యార్డులో నిల్వలు పట్టక పోవటంతో రోడ్లపై కూడా విక్రయించే వారు. ఈసారి దానికి భిన్నంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు యార్డులతో పాటు ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా బాగు చేయించటంతో రోడ్లపై బస్తాలు వేసుకునే పరిస్థితి రాకుండా మొత్తం లోపలనే విక్రయించే విధంగా చేశారు. ప్రణాళిక ప్రకారం లోపలికి వచ్చే నిల్వలను అనుమతించటంతో కొనుగోళ్లలో గందర గోళాన్ని చాలా వరకు నివారించగలిగారు. వచ్చే సరకు మొత్తాన్ని లోపల మాత్రమే కొనుగోలు చేయించే విధంగా ఏర్పాట్లు చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.