మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి,

రద్దు అయిన కమిటీల కొనసాగింపు
 నాయకుల మధ్య వాగ్వివాదం
మిర్యాలగూడ, జనం సాక్షి.
 నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. ఇటీవల పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గంతో పాటు తెలంగాణలోని జిల్లాల అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. కాగా నల్గొండ జిల్లా అధ్యక్షులుగా రెండవ సారి నియామకమైన శంకర్ నాయక్ మిర్యాలగూడ నియోజకవర్గంలో సమన్వయకర్తగా, నియోజకవర్గ ఇన్చార్జిగా అలుగుబెల్లి అమరేందర్ రెడ్డిని కొనసాగిస్తూ  ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. దాంతో ఆ పార్టీలో పదవుల ప్రాకులాట మొదలైంది. ఈ విషయమై గురువారం మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు,కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.అనంతరం సీనియర్ నాయకులుగా ఉన్న పీసీసీ డెలిగేట్ చిరుమరి కృష్ణయ్య,పగిడి రామలింగయ్య, సలీం, మెరుగు శీను తో పాటు పలువురు నాయకులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చిలుకూరి బాలు, రవి నాయక్, దేశిడి శేఖర్ రెడ్డి , జానీ, రామకృష్ణ ,సిద్దు నాయక్, కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇన్చార్జులు ఎవరు లేరని, సమన్వయకర్తగా కూడా ఎవరు లేరని పేర్కొన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. పార్టీలో పదవుల లొల్లి మరింత రాసాకందాయం లో పడింది. ఈ వివాదం సీనియర్ నాయకులు జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.