మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌

ఖమ్మం,జూలై23(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో సాగునీటి వనరులకు మహర్దశ పడుతోందని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. మంత్రి తుమ్మల సహకారంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే స్పందించి మిషన్‌కాకతీయలో నిధులు మంజూరీ చేయడం వల్ల చెరువులకు మహర్దశ వచ్చిందన్నారు. నాలుగేళ్ళలో వైరా నియోజకవర్గంలో మిషన్‌కాకతీయ పథకంలో అనేక చెరువులకు పూర్వవైభవం తెప్పించడం జరిగిందన్నారుఎ. బాగుపడ్డ చెరువులతో ఫలితాలను పొందుతున్న రైతులు సాగువిస్తీర్ణాన్ని కూడా పెంచుకున్నారు. రైతులతో పాటు గ్రామాలకు ఆదెరువుగా ఉన్న చెరువుల వల్ల మత్స్యకారులు ఇతరవర్గాలు కూడా ఆనందంగా ఉండి సీఎం కేసీఆర్‌ పాలనకు జేజేలు పలుకుతున్నారని అన్నారు. పనులు కూడా వెంటనే పూర్తికావడం సంతోషకరం అన్నారు. గత ఏడాది నుంచే రైతులకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడం, ఈఏడాది ముందుగానే పేరుపల్లి చెరువు నిండి అలుగు కూడాపోయడం రైతులు ఆనందంగా ఉన్నారు. సింగరేణి ప్రభావిత గ్రామాల చెరువులకు సింగరేణి కాలరీస్‌ ఫిల్టర్‌ బెడ్‌ నుంచి పైపులైన్ల ద్వారా సాగునీరు చెరువుల్లో నింపే పనులతో ఆ ప్రాంత రైతులు సంతోషంగా ఉన్నారు.