మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సిఐటియు

జనం సాక్షి, వంగూరు:
మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే  ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా నాయకులు బండపల్లి శివరాములు,  మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గండికోట అంజయ్య డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ వంగూరు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల రెవెన్యూ తహసిల్దార్ రాజు నాయక్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం  సిఐటి యు జిల్లా నాయకులు బండపల్లి శివరాములు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గండికోట అంజయ్య లు మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేకుండా రాత్రి అనగా పగలనక 12 గంటలు పనిచేసి ప్రజలకు తాగునీటిని అందిస్తున్న కనీస వేతనాలకు నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 9,500 వేతనాలు చెల్లిస్తే కుటుంబాలు ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం వేసిన వివిధ కమిషన్లు కనీస వేతనాలు26 వేల రూపాయలు ఇవ్వాలని సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని 8 గంటల పనిని అమలు చేయాలని, లైన్మెన్ లకు టీఏడీఏలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ,పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి బీమా సౌకర్యం పే స్లిప్పులు ఇవ్వాలని డిఈ సంతకంతో కూడిన ఐడెంటి కార్డులు ఇవ్వాలని తాడుపాటి లేకుండా పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 21000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాలస్వామి,మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ వంగూరు మండల కమిటీ అధ్యక్షులు రాములు,  ఉపాధ్యక్షులు జగన్ బాబు, చారగొండ మండల అధ్యక్షులు అహ్మద్, కార్మికులు ఎంఏ రజాక్, శేఖర్, బాలస్వామి, అంజి, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area