మిస్టిరీగా మారిన కారులోని శవం సంఘటన
నెల్లూరు, జూలై 22: గత శనివారంనాడు కావలి రూరల్ మండలం, గౌరవరం గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో దగ్ధమైన కారుతో సహా ఒక కాలిపోయిన శవం సంఘటన మిస్టిరీగా మారింది. ఈ శవం కందుకూరుకు చెందిన విజయశేఖర్ అనే వ్యాపారిదని పోలీసులు భావించారు. కాగా ఈ మేరకు బావిలో శవంతో సహా దొరికన కారు కందుకూరుకు చెందిన అరుణకుమారిదని, ఆమె భర్త విజయశేఖర్‌ను ఎవరో సజీవ దహనం చేశారని పోలీసులు తొలుత భావించారు. తన పేరుపై రిజిస్ట్రరైన కారును గుర్తించిన అరుణకుమారి, కాలిన శవం బహుశ తన భర్తదే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అందిన విశ్వసనీయ సచారం ప్రకారం విజయశేఖర్‌ను గత రాత్రి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రులో పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. కారులో దగ్ధమైన శవం ఏవరిదన్నది పోలీసులకు సమస్యగా మారింది. విజయశేఖర్‌తో కొంత మందికి మనస్పర్థలు ఉన్నాయని అరుణకుమారి చెబుతుండగా ఇందుకు సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కారులో లభ్యమైన కాలిన దేహం నమూనాలను పరీక్షకు పంపారు. కాగా కారులో ఉన్న మృతదేహం ఎవరిదన్న దానిపై పోలీసులు విజయశేఖర్‌ను, ఆయన భార్య అరుణను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.