మీరు పెట్టలేదా డెడ్‌లైన్లు

ఉద్యమకారులను కాక వలసవాదులను ప్రోత్సహిస్తున్నరు
శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర అంశాన్ని నెల రోజుల్లోగా తేల్చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. సిఎల్‌పి కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపొస్తుంది… మాపొస్తుంది… నెలలో వస్తుంది… మరో రెండు నెలల్లో వస్తోందంటూ డెడ్‌లైన్లు పెట్టి మాట్లాడిరది, తెలంగాణ ప్రజలకు ఆశచూపింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ వాళ్లు ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఓట్లు నోట్లు సాధించేందుకే టీఆర్‌ఎస్‌ నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. అంతేగానీ తెలంగాణ సాధన కోసం వారెటువంటి కృషి చేయడం లేదన్నారు. ప్రజాదరణగల ఎంపీలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంవల్ల సాధించేదేమిటో ఆ పార్టీ నాయకులే చెప్పాలన్నారు. సీట్లిస్తాం గెలిపించుకుంటాం అంటూ ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. అయితే ఆ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి మాత్రం మేలు చేకూరడం లేదని అన్నారు.  సంఖ్యాబలం పెంచుకోవడంవల్ల ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారో చెప్పాలని కెసిఆర్‌ను కోరారు. ఎంత సేపటికి సీట్లు సాధించడం ఓట్లు సాధించడం విషయాలపైనే దృష్టి పెట్టారని అన్నారు. ఒకవేళ 2014 ఎన్నికల్లో ఏదొక పార్టీకి భారీ మెజారిటీ వస్తే తెలంగాణ ఎలా సాధిస్తారో స్పష్టంచేయాలని టిఆర్‌ఎస్‌ నాయకులను కోరారు. ఎవరు దద్దమ్మలో… ఎవరు దద్దమ్మలు కారో 2014 ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని జోస్యం చెప్పారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగం ఎంతో ఉందని, దానిని గుర్తుంచుకుని స్పందించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. సోనియా, రాహుల్‌లపై విమర్శలు చేయడం మంచి సంప్రదాయం కాదని సూచించారు. తెలంగాణపై త్వరలోనే ప్రధాన నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.