ముందస్తు ఎన్నికల నిర్వహణకు కేంద్రం కుట్ర

– జమిలి ఎన్నికలను తాము వ్యతిరేకిస్తున్నాం
– నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది
– సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
అనంతపురం, జులై2(జ‌నం సాక్షి ) : దేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, జమిలీ ఎన్నికలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలో పర్యటిస్తున్న సురవరం విూడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా, ఏకపక్షంగా జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దును చేసిందని, దీని ద్వారా దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో దేశంలో మతాల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు. ఏకపక్ష విధానాలతో భారత దేశ సాంప్రదాయానికి విరుద్దంగా మత పార్టీగా బీజేపీ పాలన సాగుతుందన్నారు. దేశంలో దళితుల హక్కులను కాలరాసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చి దళితుల రక్షణను దెబ్బతీసే విధంగా ముందుకు సాగుతుందన్నారు. కేవలం ధనిక వర్గాల అభ్యున్నతికి మాత్రమే కేంద్రం విధానాలు ఉన్నాయన్నారు.  మోదీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని సురవరం తెలిపారు.