ముందస్తు వ్యూహంతో బాబు కార్యక్రమాలు
ప్రజల్లో ఉండేలా నేతలకు ఆదేశాలు
గెలుపు గుర్రాలకే మళ్లీ టిక్కెట్లు
బాబు హెచ్చరికలతో నేతల్లో గుబులు
రాజకీయ సందడితో అప్పుడే ఎన్నికల వేడి
అమరావతి,జూలై4(జనం సాక్షి ): ఓ వైపు ఏకకాల ఎన్నికలకు సన్నద్దం అవుతున్న వేళ మరో ఆరునెలల్లో ఎన్నికలు రానున్నాయన్న వార్తలు బలపడుతున్నారు. ఈ దశలోపార్టీలో మంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఈమధ్యకాలంలో చంద్రబాబు నిర్మొహమాటంగానే ఉంటున్నారు. సవిూక్షల్లో ఏకి పారేస్తున్నారు. పనితీరు సరిగా లేని వారికి టిక్కెట్లు ఇవ్వబోమన్న హెచ్చరిక ఇప్పుడు తమ్ముళ్లలో గుబులు పుట్టిస్తోంది. ప్రజల్లో లేకుంటే టిక్కట్లు ఇవ్వనని స్పస్టం చేశారు. ఇప్పటికే నాలుగేళ్ల పుణ్యకాలం కాస్తా పూర్తయి పోయింది. ఈ ఏడాదిలో ఎన్నికల కాలం ఆవహించే అవకాశాలుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలో దడ మొదలయ్యింది. ఈ దశలో బాబు ముందస్తు కసరత్తు చేస్తున్నారు. 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా జనం అధికారాన్ని కట్టబెట్టారు. ఆనాటి ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారం చేపడతారని నిఘావర్గాలు అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఉభయగోదావరి జిల్లాల్లో మార్పు వచ్చింది. చివరి నిముషంలో అంతా టిడిపికి ఓటేయడంతో బాబుకు అధికారం దక్కింది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిలచింది. అయినా ఆ పార్టీకి చెందిన దాదాపు 22మందిని లాగేసుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్నది చూడాలి. లెక్కప్రకారం 2019వ సంవత్సరంలో మేలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. మోడీ మాయచేసి ముందుకు జరిపే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల జరుగుతున్న ప్రచారం మేరకు ఆరునెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అదే కనుక జరిగితే అంతకంటే 6నెలల ముందుగానే అంటే 2018 నుండే ఎన్నికల పక్రియ ప్రారంభం కావల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్నట్టు భావించాలి. అందుకే కాబోలు చంద్రబాబు ఏకంగా ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నేతలను పురమాయిస్తున్నారు. ప్రజల్లో ఉండండని అంటున్నారు. ఇదిలావుంటే జాతీయ పార్టీ బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మళ్లీ ఫిరాయింపులు ఉంటాయని, ఏ పార్టీలో ఎవరుంటారో కూడా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అధికార తెలుగుదేశంలో ఉన్న పలువురు కీలక నేతలు జనసేన లేక వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, మరికొందరు ప్రతిపక్ష నేతలు తెలుగుదేశంలో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీంతో గత ఎన్నికల్లో రాజకీయంగా కీలకంగా ఉన్న ఉభయ గోదావరిలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. మరోవైపు జగన్ కూడా పాదయాత్రతో ఈ జిల్లాల్లో సుడిగాల పర్యటన చేశారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాల్లో ఓటరు నాడిని కొలమానంగా తీసుకోవడం అనవాయితీగా వస్తోంది. ఆ విధంగా ఉభయగోదావరి జిల్లాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకించి దృష్టి సారించడం, సెంట్‌మెంట్ జిల్లాలుగా భావించడం మామూలుగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు బ్రహ్మరథం పట్టాయి. తూర్పుగోదావరి జిల్లాల్లో 19 అసెంబ్లీ స్థానాల్లోఐదింట వైసీపీ విజయం సాధించగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజక వర్గాలుండగా అన్నిచోట్లా తెలుగుదేశం అభ్యర్ధులే విజయం సాధించడం వైసీపీకి శరాఘాతంగా మారింది. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని రీతిలో టీడీపీకి పశ్చిమ బ్రహ్మరథం పట్టింది.అయితే ఇదే జిల్లా నుండి ప్రభుత్వ వ్యతిరేకత కూడా తొలిసారిగా ప్రారంభం కావడం గమనార్హం! తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జిల్లాలో పట్టిసీమ ఎత్తపోతల పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని గోదావరి జిల్లాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా ఎత్తిపోతలను నిర్మించింది. దీనిద్వారా ఇక్కడి ప్రజలు మోసపోయారని జగన్ వెంటనే ప్రచారం ప్రారంభించారు. అయితే అది పెద్దగా ఫలించలేదు. దీంతో ఆక్వా కాలుష్యం, ఇతర సమస్యలపైనా పోరాడారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా జలాల్లో విలీనం చేసి, శ్రీశైలం నుంచి కృష్ణానీటిని రాయలసీమకు మళ్ళించడం పట్టిసీమ లక్ష్యం. దీంతో అటు సీమకు, ఇటు కృష్ణాడెల్టాకు నీరందుతోంది. ఓ రకంగా ఈ ప్రాజెక్టుల వల్ల నష్టపోయేది తెలంగాణ మాత్రమే. పట్టిసీమను కేవలం కవిూషన్ల కోసం నిర్మించారంటూ జగన్ పార్టీవారు చంద్రబాబుపై అప్పట్లో ధ్వజమెత్తారు. పట్టిసీమతో అధికార తెలుగుదేశంపై చేసిన విమర్శలు పెద్దగా వైకాపాకు లాభించలేదు. ప్రతిపక్ష వెసీపీ రాజకీయంగా మైలేజీ పెంచుకునేందుకు కృషి చేసింది. అయితే మళ్ళీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా 2018కి పూర్తి చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ ప్రాజెక్టు పనులను ప్రతి సోమవారం సవిూక్షించడం ద్వారా చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కల్పించారు. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో గత మూడేళ్ళలో అధికార పార్టీ పమ్మెల్యేలు, పంపీలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యారు తప్పితే ప్రజా సమస్యలపై కనీస స్థాయిలో స్పందించ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి, మైనింగ్, ఇసుక, నీరు ఇలా అన్ని రంగాల్లో మాఫియాలుగా మారి, పంచభూతాలను సైతం అమ్మేసుకుంటున్నారంటూ వైసీపీ ప్రచారం మొదలుపట్టింది. అయితే సదరు మాఫియాల్లో వైసీపీకి చెందిన నేతలూ ఉండటంతో ఆ పార్టీకి కొన్నిచోట్ల అవరోధంగానే మారింది. ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సమయం కేటాయించారు. బాబు కూడా అదే పనిగా కార్యక్రమాలతో ఉన్నారు. మొత్తంగా రేపటి ఎన్నికల్లో ఎవరు ఎవరివైపు ఉంటారో, ప్రజలు ఎవరికి ఓటేస్తారో అన్నది సందేహంగానే ఉంది.
————–