ముగిసిన టోక్యో ఒలంపిక్స్‌

తదుపరి వేదికగా ఫ్రాన్స్‌
భారత్‌ బంగారు కలను నిజం చేసిన నీరజ్‌
టోక్యో,ఆగస్ట్‌9(జనంసాక్షి): విశ్వ క్రీడలు జపాన్‌ రాజధాని టోక్యోనగరంలో విజయవంతంగా ముగిశాయి. చివర్లో భారత్‌ బంగారు తళుకులీనగా మన వెండకొండలు సత్తాను చాటారు. నీరజ్‌ చోప్రా బల్లెం విసిరి బంగారు పతకాన్ని భారత్‌కు పంపారు. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నజరానా అందించనుంది. కాగా, పసిడి పతక వీరుడు నీరజ్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు మణిపూర్‌ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా భారత ఆర్మీలో సుబేదార్‌గా ఉన్న నీరజ్‌ చోప్రాకు త్వరలోనే పదోన్నతి లభించనుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా.. శనివారం రాత్రి దిండు పక్కన పతకం పెట్టుకుని నిద్రపోయానని తెలిపాడు. మొత్తానికి 17 రోజుల పాటు యావత్‌ ప్రపంచాన్ని
సంబురాల్లో ముంచెత్తిన క్రీడా సంబరం ఆహల్‌ఆదంగా ముగిసింది. విపత్కర పరిస్థితుల్లో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌ దిగ్విజయంగా ముగిశాయి. జపాన్‌ రాజధానిలో ఎందరో కొత్త హీరోలు పుట్టుకు రాగా.. మరెందరో స్టార్‌ అథ్లెట్లు తెరమరుగయ్యారు. పరిమిత అతిథుల మధ్య జపాన్‌ యువరాజు అకిషినో ఆటలకు ముగింపు పలుకగా.. ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ఒలింపిక్‌ పతాకాన్ని పారిస్‌ మేయర్‌ చేతిలో పెట్టాడు. మరో మూడేండ్ల తర్వాత జరుగనున్న 33వ ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్‌ వేదిక కానుంది. చరిత్రలోనే ఎంతో ప్రత్యేకమైన టోక్యో ఒలింపిక్స్‌కు నిర్వాహకులు ఘనమైన ముగింపునిచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌కు.. ఆదివారం ముగింపు పలికారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆట పాటలతో సాగిన ముగింపు వేడుకలో పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మూడు గంటల పాటు సాగిన ముగింపు వేడుకలో భారత్‌ తరఫున స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా పతాకాధారిగా ముందు నడిచాడు. ఆరంభ ఒలింపిక్‌ జెండాను పారిస్‌ మేయర్‌ అన్నె హిడాల్గో చేతికివ్వడంతో టోక్యో విశ్వక్రీడలు ముగిసాయి. 2024లో జరుగనున్న మెగాటోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న ఫ్రాన్స్‌ ఆదివారమే రిహార్సల్స్‌ మొదలుపెట్టింది. భారీ జనసందోహం మధ్య ఈఫిల్‌ టవర్‌ వద్ద ఫ్రాన్స్‌ విమానాలు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. బాణాసంచా వెలుగుల్లో ఒలింపిక్‌ స్టేడియం తళుకులీనగా.. టోక్యో వినీల ఆకాశం కొత్త రంగులు అద్దుకుంది. ఈ క్రీడల్లో 39 స్వర్ణాలతో సహా 113 పతకాలు రాబట్టిన అమెరికా.. పట్టిక టాప్‌లో నిలువగా.. చైనా (88), జపాన్‌ (58) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. భారత్‌.. ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో 48వ స్థానంతో మెగాటోర్నీని ముగించింది. కరోనా సంక్షోభం వేళ భవిష్యత్తుపై భరోసా ఇచ్చేలా ఈ క్రీడలతో ప్రపంచ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దానిని ఎదుర్కొంటూ క్రీడలను నిర్వహించారు. రాజధాని టోక్యోలో వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. వాటి ప్రభావం క్రీడానగరంపైనా పడిరది. ప్రతిరోజూ క్రీడాకారులు కరోనా బారిన పడుతూనే ఉన్నప్పటికీ పట్టుదలతో క్రీడలను పూర్తిచేశారు. కరోనా కారణంగా ప్రేక్షకులు ఎవర్నీ అనుమతించలేదు. ఉత్సాహం నింపే ప్రేక్షకులు లేకపోవడంతో క్రీడలు చప్పగా సాగాయి. మొత్తంగా భారత్‌కు ఈ ఒలంపిక్స్‌ బంగారు కలను నిజం చేసింది.

తాజావార్తలు