ముగ్గురి హత్యకేసులో మూడు సింహాలను దోషులుగా గుర్తింపు

1

– 14 మృగరాజులకు విముక్తి

అహ్మదాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి):సింహాలపై విచారణ ఓ కొలిక్కి వచ్చింది. గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్కులో అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న 17 సింహాల్లో 3 సింహాలు మనుషులను తినే స్వభావమున్న సింహాలని అధికారులు గుర్తించారు. గిర్‌ పార్కు సవిూపంలో ముగ్గురు వ్యక్తులు సింహం దాడిలో చనిపోవడంపై అధికారులు 17 సింహాలను కస్టడీలోకి తీసుకుని వాటిలో ఏ సింహం హత్యలు చేసిందో తెలుసుకోవడానికి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మ్యాన్‌-ఈటర్లు’గా గుర్తించిన మూడు సింహాలను జూకు తరలించి బోనులో పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.సింహాల పంజా గుర్తులు, ముఖకవళికలు, తదితర వివిధ రకాల పరీక్షల ద్వారా 25 రోజుల పాటు విచారించిన అనంతరం ఓ మగ సింహం, రెండు ఆడ సింహాలు ముగ్గురు మనుషులను చంపేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మూడు సింహాల మలమూత్రాల్లో మానవ అవశేషాలు ఉన్నట్లు గుర్తించామని జునాగఢ్‌ డివిజన్‌ ఫారెస్ట్‌ కన్సర్వేషన్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌ వెల్లడించారు. మగ సింహాన్ని జీవితాంతం జూనాగఢ్‌ శివారులోని సక్కార్‌బర్గ్‌ జూలో ఉంచనున్నట్లు చెప్పారు. రెండు ఆడసింహాలను జీవితకాలం అటవీ శాఖ రెస్క్యూ సెంటర్లలోనే ఉంచాలని నిర్ణయించారు. మిగతా 14 సింహాలను స్వేచ్ఛగా అడవిలో వదిలేయనున్నారు.గిర్‌ నేషనల్‌ పార్కు అడవిలో సుమారు 400 ఏషియాటిక్‌ సింహాలు ఉన్నాయి. ఆఫ్రికా తర్వాత ఈ తరహా సింహాలు ఎక్కువగా ఉన్నది ఇక్కడే. అయితే నేషనల్‌ పార్కులో 270 సింహాలు ఉండడానికి తగిన చోటు మాత్రమే ఉంది. దీంతో సింహాల సంఖ్య ఎక్కువై సవిూపంలోని గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఈ పార్కులో ఎక్కువగా ఉన్న సింహాలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంకా చర్యలు తీసుకోలేదు.