ముచ్చటగా మూడోసారి

పాక్‌ ప్రధాని పీఠం ఎక్కనున్న నవాజ్‌
భారత్‌కు సానుకూల వైఖరి
పలు అంశాలపై గతంలో చర్చలు
భారత్‌ చర్చినందుకే ముషారఫ్‌ తిరుగుబాటు
ప్రధాని శుభాకాంక్షలు.. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం
ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) అధినేత నవాజ్‌ షరీఫ్‌ ముచ్చటగా మూడో సారి ఆ దేశ ప్రధాని కానున్నారు. శనివారం జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌(ఎన్‌)కు ఆ దేశ ప్రజలు అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఈ విజయంతో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పీపీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆరున్నర దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రలో శనివారం జరిగిన మైలు రాయి వంటి సార్వత్రిక ఎన్నికల్లో పిఎంఎల్‌-ఎన్‌ అత్యధిక స్థానాలను సాధించింది. 272 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో 262 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో 126 స్థానాల్లో పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నేషనల్‌ పార్టీ ఘన విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఐ-ఇన్సాఫ్‌ పార్టీ 34 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 71 స్థానాల్లో గెలుపొందారు. పీపీపీ పార్టీ కేవలం 32 స్థానాలకే పరిమితమై ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. పంజాబ్‌లోని సర్గోదా నుంచి షరీఫ్‌ విజయం సాధించారు. పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ పెషావర్‌-1 నుంచి ఘన విజయం సాధించారు. ప్రజాస్వామ్యయుత అధికార బదిలీ దిశగా తొలిసారిగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో పాక్‌ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం పోలింగ్‌ సందర్భంగా అనేక చోట్ల బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. కరాచిలో మూడు చోట్ల జరిగిన బాంబు దాడుల్లో 13 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. పెషావర్‌లోని తూర్‌గడ్‌లో బాంబు పేలి ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఓ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తానే పేల్చేసుకున్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. మరికొన్ని చోట్ల జరిగిన ఘటనల్లో మరికొందరు మరణించిన విషయం తెలిసిందే. పాక్‌ ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్‌ గెలుపుతో భారత్‌తో సంబంధాలు పటిష్ట పడనున్నాయి. ఈ విషయాన్ని నవాజ్‌ కూడా ధ్రువీకరించారు. భారత్‌తో సానుకూల వైఖరి ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో భారత్‌తో పలు అంశాల్లో చర్చలు జరిపారు. దీనిని నిరసిస్తూ అప్పటి సైనిక దళాల ప్రధానాధికారి పర్వేజ్‌ ముషారఫ్‌ ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు తెచ్చి నవాజ్‌ను పదవీచ్యుతిడి చేశారు. మళ్లీ నవాజ్‌ పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య స్నేహం బంధం బలపడే అవకాశముంది.
హామీలు నెరవేరుస్తా : నవాజ్‌షరీఫ్‌
హామీలు నెరవేరుస్తానని, తనను, తన పార్టీకి అత్యధిక మెజారిటీ కట్టబెట్టినందుకు పాక్‌ ప్రజలకు ప్రత్యేకంగా యువతకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నవాజ్‌షరీఫ్‌ ప్రకటించారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ పార్టీ అత్యధిక మెజారిటీని సాధించింది. ఆ పార్టీ అధినేత నవాజ్‌ షరీష్‌ మూడోసారి ఆ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. 1990 నుంచి 1993 వరకు,
1997 నుంచి 1999 వరకు ప్రధానిగా ఆయన పనిచేశారు. 1990లో భారత్‌తో శాంతి చర్చలకు చొరవ చూపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు.
భారత్‌ హర్షం
పాక్‌లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పాటుపై భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని కొత్త సర్కార్‌ ఆధ్వర్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. అలాగే జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, కేంద్రమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని శుభాకాంక్షలు.. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం
పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీఎంఎల్‌(ఎన్‌) నేత నవాజ్‌ షరీఫ్‌ను భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభినందించారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నవాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించిన ఎన్నికల్లో పీఎంఎల్‌ (ఎన్‌) విజయం సాధించడం గొప్ప పరిణామమన్నారు. ప్రధానిగా భారత్‌లో పర్యటించాల్సిందిగా మన్మోహన్‌, నవాజ్‌ షరీఫ్‌ను ఆహ్వానించారు.