మునిగిపోయిన ‘ఆశ’లు…
` మానేరు వాగులో ఐదుగురు విద్యార్ధుల గల్లంతు
` ఒకరు మృతి.. మిగిలిన వారి కోసం గాలింపు
` సిరిసిల్ల రాజీవ్‌నగర్‌లో అలుముకున్న విషాదం
రాజన్నసిరిసిల్లబ్యూరో, నవంబర్ 15, (జనంసాక్షి): కలలన్నీ బిడ్డల చుట్టూ పోగేసుకున్న తల్లితండ్రులకు తీరని విషాదం మిగిలింది. ఈత సరదా విద్యార్ధుల ప్రాణం మీదికి తీసుకువచ్చింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన 8 మంది విద్యార్ధులు ఈత కొట్టేందుకు మానేరు వాగులోకి వెళ్ళారు. చెక్ డ్యాం సమీపంలో ఈత కోసం వెళ్ళిన వారిలో ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. వీరిలో ఒకరు మృతిచెందారు. ఈవిషాద సంఘటన సోమవారం సాయంకాలం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం సిరిసిల్ల పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్ధులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మానేరు వాగులోని చెక్‌డ్యాం సమీపంలో ఈత కొట్టేందుకు వెళ్ళారు. వీరిలో ఐదుగురు విద్యార్ధులు నీళ్ళల్లో మునిగిపోయినట్టు సమాచారం. మిగిలిన ముగ్గురు విద్యార్ధులు వెనుతిరిగిపోయారు. పదవ తరగతి చదువుతున్న కొలిపాక గణేష్(14) మృతిచెందాడు. గల్లంతైన వారిలో 8వ తరగతి చదువుతున్న జడల వెంకటసాయి, సింగం మనోజ్, తీగల అజయ్‌లు ఉన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మానేరు తీరంలో విద్యార్ధుల తల్లితండ్రులు, బంధువుల శోకంతో మూగబోయింది. రాజీవ్‌నగర్‌లో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.