మున్సిపల్ చైర్ పర్సన్ మార్పు అనివార్యమే నా
– త్వరలో ఉత్కంఠకు తెర
కొత్త చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టనున్న లంక పుష్పలతా రెడ్డి
– తీవ్ర ప్రయత్నాలతో ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో కొలువు కానున్న కొత్త చైర్మన్
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జులై
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. అమాత్యుల ఆదేశాలతో చైర్మన్ మార్పుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ 25 వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యి కొనసాగుతున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ లో 34 వార్డులు ఉండగా టిఆర్ఎస్ పార్టీ 25 కైవసం చేసుకోగా 6 కాంగ్రెస్, బిజెపి ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానాన్ని గెలుపొందారు. 30వ వార్డు ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థి సువర్ణ, కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అనిత టిఆర్ఎస్ లో కలిశారు. దీంతో టిఆర్ఎస్ బలం 27 పెరిగింది. కాగా ఎన్నికల సమయంలో 25 వ వార్డు కౌన్సిలర్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ 29వ వార్డు కౌన్సిలర్ లంక పుష్పలత రెడ్డి మధ్యలో చైర్పర్సన్ కోసం తీవ్రమైన పోటీ ఉండటంతో చెరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్ పదవిలో కొనసాగాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తదితర ప్రజాప్రతినిధుల సమక్షంలో రెండున్నర సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ పదవిలో కొనసాగాలని ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. మొదటి రెండున్నర సంవత్సరాలు చిగుళ్ల పల్లి మంజుల రమేష్ కొనసాగుతున్నారు. ఒప్పందం ప్రకారం గడువు సమీపించడంతో కుర్చీ దిగిపోవాలి అంటూ ఒకరు, దిగిపో మంటూ మరొకరు ఎత్తుల రాజకీయాలు నడిపించారు. ఒప్పందం ప్రకారం పదవి కాలం దాదాపుగా పూర్తి కావడంతో తదుపరి చైర్మన్ అయ్యే లంక పుష్పలతా రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనికిగాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అనుకూలంగా ఉండడంతో త్వరలోనే చైర్ పర్సన్ గా లంక పుష్పలత రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ప్రస్తుతం జరిగే పరిణామాలను బట్టి చూస్తే త్వరలో పుష్పలతా రెడ్డి పదవి భాద్యతలుచేపట్టనున్నట్లు స్పష్టమవుతుంది.