ముమ్మరంగా వ్యవసాయ పనులు

వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

ఆదిలాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): సీజన్‌ ప్రారంభం నుంచి వానలు అనుకూలిస్తుండడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుత వానలు పంటల సాగుకు అనువుగా ఉండడంతో వేసిన పత్తి, సోయాబీన్‌, పెసర, కంది పంటలు మంచి ఎదుగుదల దిశలో ఉన్నాయి. ప్రారంభం నుంచి రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 2 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందజేశారు. జిల్లాలో ఈ సారిపత్తి, సోయా,కంది,జొన్న, వరి, మొక్కజొన్న, పెసర, ఇతర పంటలు సాగయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు ఎరువులను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో కన్నా ఎరువుల ధరలు తగ్గుతాయని భావించిన రైతులకు నిరాశ ఎదరువుతోంది. జిల్లాలోని చాలా మంది వ్యాపారులు ఎరువుల ధరలను తగ్గించకపోగా ఇతర ఛార్జీల పేరిట అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 70 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా. జిల్లాలో చాలా మంది వ్యాపారులు పాత ధరలకే ఎరువులను విక్రయిస్తున్నారు. మరోవైపు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జూన్‌ ప్రారంభంలో అడపదడప వర్షాలు కురియగా.. అన్నదాత వర్షాల కోసం ఎదురు చూశారు. ఈ తరుణంలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. జిల్లాలోని ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతున్నది. మత్తడి వాగు ప్రాజెక్టులో స్వల్పంగా చేరుకుంది.సాత్నాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. అత్యధికంగా నార్నూర్‌ మండలంలో 64.4 మి.విూటర్ల వర్షం కురిసింది.వంతెనలు లేక పోవడంతో ప్రజలు వాగులు, వంకలు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది.నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం, భీంపూర్‌ మండలంలోని గుంజాల, బోథ్‌ మండలంలోని పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదివారం కావడంతో జలపాతాల వద్ద పర్యాటకుల సందడి కనిపించింది.

 

తాజావార్తలు