ముల్కనూర్ డెయిరీకి ప్రతిష్టాత్మక అవార్డు
కరీంనగర్, డిసెంబర్ 7 (జనంసాక్షి) :
జిల్లాలోని భీమదేవరపల్లి ముల్కనూరు స్వకృషి డెయిరీ ప్రతిష్టాత్మక కో ఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైంది. శనివారం న్యూఢిల్లీలో జరిగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) స్వర్ణోత్సవ కార్యక్రమంలో డెయిరీ అధ్యక్షురాలు కడారి ప్రేమలీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు అంజేస్తారు. ఈ అవార్డుకు అసోం, మహారాష్ట్రలోని పలు సహకార సంస్థలు ఎంపికయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి మహిళా సహకార డెయిరీ కూడా ఇదే కావడం గమనార్హం. భీమదేవరపల్లి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెయిరీ కరీంనగర్, వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి పాలను సేకరిస్తోంది. వరంగల్ కేంద్రంగా పాలను మార్కెటింగ్ చేస్తూ అనతికాలంలో లాభాలు ఆర్జిచింది. ఈ సందర్భంగా డెయిరీ అధ్యక్షురాలు పుష్పలీల జనంసాక్షితో మాట్లాడారు. సాధారణ మహిళను జాతీయ స్థాయి అవార్డు అందుకునేలా చేసింది స్వకృషి డెయిరీ అని చెప్పారు. తనలాంటి వేలాది మంది సభ్యులు ఈ డెయిరీతో ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించారని ఆమె పేర్కొన్నారు. అందరి సహకారంతో మరింత బాధ్యతతో డెయిరీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.