ముసురుకుంటున్న వ్యాధులు
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ఆదిలాబాద్,జూన్13(జనం సాక్షి): తొలకరి ప్రాంభంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోగాలు ముసురు కుంటున్నాయి. అధికారులు ఎంతగా హెచ్చరించినా, స్వఛ్చ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కాకపోవడంతో గ్రామాలు అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. కలుషిత నీటిని తాగడం మూలంగా గ్రామస్తులు వ్యాధి బారిన పడుతున్నారు. అయితే వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యమంతులుగా ఉంటారని, గిరిజన ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వీటీడీఏల సహకారం తీసుకోవాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. స్వచ్ఛ భారత్ (గ్రావిూణ) కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, 78గ్రామ పంచాయతీల్లోని గ్రామాల్లో జూలై 15నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో నిర్మించే మరుగుదొడ్లకు స్థానిక వీటీడీఏల సహకారం తీసుకొని, లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రివాల్వింగ్ ఫండ్ కింద మంజూరు చేసిన నిధులను మూడు నెలల్లోగా తిరిగి చెల్లించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. తెలంగాణ హరితహారం కార్యక్రమం కింద ఇప్పటికే గుంతలు తవ్వించాల్సి ఉందని, వర్షాకాలం ప్రారంభమైనందున మొక్కలు నాటాల్సి ఉందని అన్నారు. ప్రతి మండలానికి కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు.