ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌

4

– తమిళనాడు తరహాలో చట్టసవరణ

– సుధీర్‌ కమిషన్‌ సీఎం కేసీఆర్‌కు నివేదిక

హైదరాబాద్‌,ఆగస్టు 12(జనంసాక్షి): ప్రత్యేక చట్టం ద్వారా ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం ద్వారా వారికి ఈ రిజర్వేషన్లు అమలుచేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకువేసిన కమిటీలు కసతరత్తు చేసి నివేదికలను సిఎం  కెసిఆర్‌కు సమర్పించారు. ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లపై రాజ్యాంగ నిబంధన ఉందన్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీనవర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, సంఖ్యకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు.  ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం సుధీర్‌ కమిషన్‌, చెల్లప్ప కమిషన్‌ సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి నివేదిక అందజేశారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణలో బలహీన వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున అందుకనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవాల్సి ఉందన్నారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణలో ముస్లింలు అత్యంత పేదరికంలో ఉన్నారని, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై త్వరలో కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయని తెలిపారు. ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగ నిబంధన అని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కాగా, సుధీర్‌, చెల్లప్ప కమిషన్లు ఎస్టీలు, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపి  సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారు.