ముస్లిం అని ఫ్లాట్ ఖాళీ చేయించారు

zfwrrreiగుజరాత్:    మొన్న డైమండ్స్ ఎగుమతి చేసే ఒక కార్పొరేట్ సంస్థ ముస్లిం యువకుడికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తే… తాజాగా ఓ ముస్లిం యువతికి ఇల్లు ఇవ్వడానికి  నిరాకరించిన ఉదంతం  గుజరాత్లో సంచలన సృష్టించింది.  దీనికి నిరసిస్తూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే కమ్యూనికేషన్ ప్రొఫెషన్లో ఉన్న  25 ఏళ్ల మిస్బా ఖాద్రి.. మరో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుంది. దీనికోసం వదాలలోని సాంఘ్వి  హైట్స్లోని ట్రిపుల్ బెడ్రూమ్  ఫ్లాట్ కోసం అపార్ట్మెంట్ అసోసియేషన్ను సంప్రదించింది.   అంతా  ఓకే అయ్యాక….  ఆ ఇంటికి మారడానికి  ఒక రోజు ముందు  ముస్లింలు తమ అపార్ట్మెంట్లో ఉండడానికి కుదరదంటూ  హౌసింగ్ సొసైటీ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నివ్వెరపోయిన  ఖాద్రి వెంటనే రెంటల్ ఏజెంట్ను సంప్రదించింది.  అయితే ఆ అపార్ట్మెంట్లో ఆమెపై ఎలాంటి వేధింపులు, గొడవలు జరిగినా తమకు (హౌసింగ్ సొసైటీ, బిల్డర్, ఏజెంట్)  ఎలాంటి సంబంధం లేదని హామీ  యిస్తూ నో అబ్జెక్షన్ లెటర్ రాసి  యివ్వాలని, అలాగే ఆమె వ్యక్తిగత వివరాలతో కూడిన బయోడేటా కావాలని షరతులు విధించటం జరిగింది.  అయితే   మిగిలిన ఇద్దరు మహిళలు ఇచ్చిన భరోసాతో వారి షరతులకు ఒప్పుకున్న ఖాద్రి ఎట్టకేలకు ఇంట్లో చేరారు.

అలా ఇంట్లో చేరి వారం రోజులు అయిందో లేదో మళ్ళీ  వివాదం మొదటి  కొచ్చింది.  మిస్బా ఖాద్రి  తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలనీ,  బైటికి గెంటేస్తామనీ, లేదంటే పోలీసులకు  పిలవాల్సి వస్తుందని రెంటల్ ఏజెంట్ బెదిరించాడు.  ముస్లింలకు  ఫ్లాట్ అద్దెకివ్వడానికి తమ కంపెనీ రూల్స్ ఒప్పుకోవంటూ తెగేసి చెప్పాడు.  దీంతో విసిగిపోయిన  బాధితురాలు జాతీయ  మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించింది. కాగా ఫ్లాట్లో అద్దెకు చేరిన  ముగ్గురిలో  మిస్బా ఖాద్రి ఒక్కరే ముస్లిం.   ఈ వివాదంతో ముగ్గురూ  ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది.

గుజరాత్లోనే పుట్టి పెరిగిన తాను  2002 ఘర్షణల  అనంతరం  ముంబైకి  వెళ్లిపోయినట్లు మిస్పా ఖాద్రి తెలిపింది. అయితే ఉద్యోగరీత్యా  మళ్లీ గుజరాత్  రావాల్సి వచ్చిందని,  అభివృద్దికి నమూనాగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో గుజరాత్లో కొనసాగుతున్న మతవివక్షపై  ఆమె  నిరసన  తెలిపింది.  గోద్రా అల్లర్లతో  మత ఘర్షణలకు పేరు గాంచిన గుజరాత్ రాష్ట్రంలో మత వివక్ష  కొనసాగుతున్న ఆనవాళ్లు కనిపించడంపై మిస్బా ఆందోళన వ్యక్తం చేసింది.