మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నాం
` యువ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది
` విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు
` ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్(జనంసాక్షి): మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. యువ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఎస్‌బీ విద్యార్థులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం విద్యారంగంపై ఎవరూ ఊహించనిరీతిలో పెట్టుబడులు పెడుతుందని తెలిపారు. విద్యపై పెట్టుబడి రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుందని చెప్పారు.రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పూర్తి ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణం ప్రారంభించినట్లు వివరించారు. విద్యార్థులు కళాశాల విద్య పూర్తి చేసుకొని బయటకు వెళ్లగానే ఉద్యోగం పొందేలా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ ఎలా ఉండాలి అనేది పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం నేర్చుకోవడానికి ఇష్టపడతారని… రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఎస్‌బీలో 5 రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం రూపొందించి అమలు చేయాలని నిర్వాహకులను డిప్యూటీ సీఎం కోరారు. ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజాన్ని చైర్మన్ గా నియమించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఐ ఎస్ బి నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను సందర్శించి వాటికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. అవి ప్రారంభ దశలో ఉన్నందున ఇప్పుడు ఐ ఎస్ బి నుంచి సూచనలు అందితే అది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐ ఎస్ బి విద్యార్థులు గొప్ప అదృష్టవంతులు ఒక్కో తరగతి గది 1.50 కోట్ల నుంచి రెండు కోట్ల వరకు వెచ్చించి నిర్మించారు. తాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సింగిల్ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానని, రాసుకునేందుకు పలకలు కూడా లేక పోవడంతో మా గురువులు ఇసుక పైనే అక్షరాలు దిద్దిన సందర్భాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. గురుపూజ దినోత్సవం రోజు ఐ ఎస్ బి వంటి గొప్ప విద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించుకోవడం అభినందనీయం అన్నారు. తాను ఈ స్థానానికి రావడానికి కృషి చేసిన గురువర్యులందరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో, ఆశయాలు మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు గౌరవంగా, సంతోషంగా ఉంది అన్నారు. ఈ రోజు మనం కేవలం దాతృత్వాన్ని కాదు, దానిని మించే ఒక భావాన్ని సాక్షాత్కరిస్తున్నాం అన్నారు..మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఇచ్చిన సహకారం ఒక విరాళం మాత్రమే కాదు, అది జ్ఞానం, నాయకత్వం, మరియు మన సమిష్టి భవిష్యత్తుపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అన్నారు. మనం తరచూ ప్రభుత్వాలు రోడ్లు కడతాయి అంటాం, కానీ దూరదృష్టి ఉన్న దాతృత్వం మాత్రం నేర్చుకునే ద్వారాలను నిర్మిస్తుంది. అలాంటి ద్వారం మన ముందుకు తెరిచినందుకు మోతీలాల్ ఓస్వాల్ కు ధన్యవాదాలు తెలిపారు.