మూడు పార్టీలూ తోడు దొంగలే
– రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి
– వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే గుండు కొడతారు
– ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, జులై6(జనం సాక్షి) : ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు మూడు తోడుదొంగలేనని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ద్రోహులంతా ఒక్కటై రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన వారే… రాష్ట్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలే ఇప్పుడు వైసీపీ, బీజేపీ నేతలుగా రూపాంతరం చెందారని విమర్శలు గుప్పించారు. పదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినవాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై దేవినేని మండిపడ్డారు. జగన్ అనవసరంగా ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కి గుండు కొడతారని వ్యాఖ్యానించారు. బొత్స, కన్నా, ధర్మాన పదేళ్లు మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని దేవినేని ప్రశ్నించారు. జగన్, పవన్‌లు నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, పార్లమెంట్ కి ఎంపీలు వెళ్లలేరు, వీళ్ళకి అసలు రాష్ట్ర ప్రయోజనాలే అవసరం లేదన్నారు. వైఎస్ జగన్, సీఎం పదవి పిచ్చిపట్టి రోడ్లపై తిరుగుతున్నాడంటూ దేవినేని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా పోలవరం డ్యామ్ సైట్ పనులు చూడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అనర్హుడని, తప్పుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే కేసులు వేసి అడ్డుపడుతున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, నీళ్లు ఇవ్వలేదని మంత్రి దేవినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైన వైసీపీ, జనసేన అధినేతలు కేంద్రంపై పోరాటానికి టీడీపీతో కలిసి రావాలని తద్వారా ప్రజల్లో మన్ననలు పొందాలని కోరారు.
పోలవరం చూడకుండానే జిల్లా దాటిన వ్యక్తి జగన్..
పట్టిసీమపై కాంగ్రెస్, వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఆల్మట్టికి ఇప్పటి వరకూ నీరు రాలేదని, అయినా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తుంటే కుళ్లుకుంటున్నారని విమర్శించారు. ఒక బేసిన్ నుండి మరో బేసిన్‌కు 105 టీఎంసీలు తరలించడం రికార్డు అని అన్నారు. పట్టిసీమను అందరూ అభినందిస్తుంటే జగన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు చూడకుండానే గోదావరి జిల్లా దాటిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. రాజ్యసభలో
ప్రశ్నలు వేస్తూ పక్కరాష్ట్రాలకు విజయసాయిరెడ్డి సమాచారం ఇస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
వైకుంఠపురం బ్యారేజ్‌కు ఈ నెలలో టెండర్లను పిలుస్తున్నామని తెలిపారు. 10 టీఎంసీల సామర్థ్యంతో వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం ఉంటుందన్నారు. గోదావరి-పెన్నా అనుసంధానంతో సోమశిల, పెన్నా, కండలేరు ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని తెలిపారు. ఈనెల 11న గడ్కరీ రాష్ట్రానికి రానున్నట్లు మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు.