మూడు వరుస పేలుళ్లతో ..
వాషింగ్టన్, (జనంసాక్షి) :బాంబుల మోతతో అమెరికా దద్దరిల్లింది. వరుస పేలుళ్లతో అగ్రరాజ్యం వణికిపోయింది. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 140 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్లతో అమెరికా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. అత్యాధునిక పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడినట్లు గుర్తించారు. పేలుళ్ల ఘటనను అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నిందితులను గుర్తించి, వారు ఎక్కడ ఉన్నా పట్టుకొని శిక్షిస్తామని ప్రకటించారు. అయితే, ఈ పేలుళ్ల వెనక ఎవరి హస్తముందనేది పేర్కొనలేదు. ఉగ్రవాదుల దాడి అని కొందరు అధికారులు చెబుతుంటే, ఒబామా మాత్రం పేలుళ్ల వెనక ఎవరున్నారో ఇంకా తెలియలేదన్నారు. అయితే, తాజా ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ సౌదీ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బోస్టన్‌లో సోమవారం ఓ మారథాన్ నిర్వహించారు. దాదాపు 27 వేల మంది ఇందులో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లో మారథాన్ ముగుస్తుందనగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తొలి పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన క్రీడాకారులు, అధికారులు తలో దిక్కుకు పరుగు తీశారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో బాంబు పేలింది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అరుపులు, హాహాకారాలతో మార్మోగింది. మారథాన్‌లో పాల్గొన్న వారితో అప్పటిదాకా సందడిగా ఉన్న ఆ ప్రాంతం రక్తిసిక్తమైంది. అత్యాధునిక పేలుడు పదార్థాలతో కూడిన బాంబులను అమర్చడంతో ముగ్గురు మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మారథాన్‌లో పాల్గొన్న అనుమానితులే బాంబులు అమర్చి ఉంటారని భావిస్తున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసుల సోదాల్లో మరో రెండు బాంబులు లభ్యమయ్యాయి. బాంబ్‌స్క్వాడ్ బృందాలు వాటిని నిర్వీర్యం చేశాయి. బోస్టన్ మారథాన్‌లో జంట పేలుళ్ల నేపథ్యంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, క్రీడాప్రాంగణాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మసాచుశాట్స్ గవర్నర్ డెవల్ పాట్రిక్, బోస్టన్ మేయర్ థామస్ మెనినీలు పరిస్థితిని సవిూక్షించారు. అయితే, ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారనే దానిపై అధికారులు ఇంకా నిర్దారణకు రాలేదు. ఉగ్రవాద దాడులా? లేక ఇంకేవరి హస్తమైనా ఉందా? అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు, ఈ ఘటనపై అధ్యక్షుడు ఒబామా విచారణకు ఆదేశించారు. దాడికి పాల్పిడింది ఎవరు? ఎందుకొరకు పేలుళ్లు జరిపారనే అంశాలను వెలికితీయాలని సూచించారు. పేలుళ్లలో గాయపడిన బాధుతులకు అవసరమైన చికిత్స ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పేలుళ్లను తీవ్రంగా ఖండించిన ఒబామా… మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి పేలుళ్లకు పాల్పడిన వ్యక్తులు, సంస్థలను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.