మూత్రాశాలల్లో సిసి కెమెరాలు

నకలు కొట్టకుండా అని సమర్థించుకున్న కళాశాల యాజమాన్యం
మండిపడుతున్న విద్యార్థులు
ఆగ్రా,మే21(జ‌నం సాక్షి):  పరీక్షల సందర్భంగా విద్యార్ధులు కాపీయింగ్‌ కోసం చిట్టీలు పెడుతున్నారని ఏకంగా కళాశాల టాయ్‌లెట్లలోనే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఈ విషయం గమనించి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ  వింత ఘటన యూపీ రాష్ట్రంలోని అలీఘడ్‌ డిగ్రీ కళాశాలలో జరిగింది. అలీఘడ్‌ లోని ధరం సమాజ్‌ డిగ్రీ కళాశాలలోని తమ టాయ్‌లెట్లలో సీసీటీవీ కెమెరాలు పెట్టి తమ గోప్యతకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. భద్రత, చిట్టీల పేరిట కళాశాల టాయ్‌లెట్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఏమిటని లా విద్యార్థి సౌరబ్‌ చౌదరి ప్రశ్నించారు. తాము టాయ్‌లెట్లలోమూత్రం పోస్తున్నదృశ్యాలను సీసీటీవీ కెమెరాలో రికార్డు చేయడమేమిటని మరో విద్యార్థి సంజీవ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పరీక్షల్లో విద్యార్థులు చిట్టీలు పెట్టకుండా నివారించేందుకే తాము కళాశాల టాయ్‌లెట్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్‌ ప్రకాష్‌ గుప్తా చెపుతున్నారు. కాగా ఈ ఘటనపై విద్యార్థులు కళాశాల యాజమాన్యంపై పరువునష్టం కేసు వేయాలని జాతీయ మైనారిటీ విద్యా సంస్థ సభ్యుడు మానవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సూచించారు. ఇలాంటి వ్యవహారాలు విద్యార్థులను అవమానించేదిగా ఉందన్నారు. విద్యార్థులను మరీ చులకన చేసే ఇలాంటి చర్యలపై తగు చర్యలు తీసుకోవాలన్నారు.