మృతులు 5000 పైచిలుకే..

జాతీయ విపత్తుగా ప్రకటించని సర్కారు
సహాయానికి వర్షం అడ్డంకి
మరో రెండు రోజులు భారీ వర్షాలు
శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా కదలని సర్కారు
డెహ్రాడూన్‌, జూన్‌ 23 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌లో జలప్రళయం ఐదు వేలకు పైచిలుకు మందినే బలితీసుకుంది. అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ పెను ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించలేదు. కనీసం వెయ్యి మందికి పైగా మృతిచెందినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నా గంగలో కొట్టుకుపోయిన వాళ్లు, శిథిలాలకింద చిక్కుకుపోయి చనిపోయిన వారి సంఖ్య ఇంతవరకూ లెక్కతేలలేదు. ఐదు వేల మందికి పైగా చనిపోయినట్టుగా అనధికారిక లెక్కలు అందుతున్నా అంతకు పెక్కు సంఖ్యలో మృతులుండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు భారీ వర్షాలతో అంతరాయం తలెత్తింది. మరోవైపు అడవుల్లో చిక్కుకున్న బాధితుల మృత్యుఘోష ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడంలేదు. హెలికాప్టర్‌ ద్వారా బాధితులను రక్షించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు వాతావరణం అనుకూలించకపోవడంతో బాధితుల గోస అంతాఇంతా కాదు. గత వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో చిక్కుకున్న బాధితులు ఎటూ వెళ్లలేక.. సహాయం అందక చలిలో గజగజ వణుకుతూ ప్రాణాలపై ఆశలువదులుకొని జీవచ్ఛల్లా బతుకుతున్నారు. ఆ ప్రాంతంలో దట్టంగా అలుముకున్న పొగమంచు వల్ల అక్కడ ఏమి కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు సైతం చేతులు ఎత్తేశారు. విపరీతమైన మేఘాలు కమ్ముకోవడంతో పొగమంచు వల్ల వెలుతురే లేకుండా పోయింది.  సైన్యం రంగంలోకి దిగినా ఏమి చేయలేని పరిస్థుతులు లేకుండా పోయాయి. హెలికాప్టర్లు పోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. వాతావరణం అనుకూలించే వరకు అక్కడ వున్న బాధితులకు సహాయం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా విషాదకర పరిస్థితుల్లో వనరులు అన్నీ వున్నా వాతావరణం అనుకూలించకపోవడం వారి దురదృష్టమే. మరో పిడుగులాంటి వాతావరణ శాఖ వార్తలు అధికారులను సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. మరో 24గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు మరో 48గంటలు ఆగాల్సిందే. ఈ ఘోర విపత్తుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత విధానాలే కారణమనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం పర్యావరణ శాఖ అనుమతులు కూడా లేకుండా నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల వల్లే ఒక్కసారిగా వరదలు పోటెత్తాయని సమాచారం. ఈ విషయం రెండేళ్ల క్రితం శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల బృందం హెచ్చరించింది. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ నిర్లక్ష్యం ఫలితమే ఈ మానవ హననానికి కారణమైంది. జోరు వానలో తిండీ, నీళ్లు లేక యాత్రీకులు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న భోజనం, నీళ్లు ఎవరికీ సరిపోని పరిస్థితి. ఇప్పటికీ కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన యాత్రీకుల్లో ఎక్కువ మంది తెలుగువారేనని అధికారులు పేర్కొన్నారు. కొండ కోనల్లో ఇంకా 50 వేల మంది చిక్కుకుపోయారు. ఆక్సిజన్‌ అందక, వైద్యం సహాయ లేక అనేక మంది అక్కడే మృతిచెందినట్లు తెలిసింది. ఆదివారం వందల సంఖ్యలో యాత్రీకులు మృత్యువాతపడినట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇంకా వేలాది మంది మృత్యువుకు చేరువకాక తప్పని పరిస్థితి నెలకొంది.